తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని.. సొంత పార్టీపైనే పోరాటం చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట.. పోరాడితే పోయేదేమీ లేదని పెట్టిన పోస్టును ఇప్పుడు చేతల్లో చూపిస్తున్నారు. ఎంపీగా గెలిచిన వంటనే.. నాగపూర్ వెళ్లి… నితిన్ గడ్కరీని పనిగట్టుకుని కలిసి మరీ శుభాకాంక్షలు చెప్పి వచ్చిన… ఆయన.. అప్పట్నుంచి.. టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు బహిరంగంగా… మొదటి సారి.. దేవినేని ఉమను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో… కృష్ణా జిల్లా నుంచి కొడాలి నానికి మంత్రిగా చాన్స్ దొరికింది. అలా చాన్స్ దొరకడానికి.. జగన్ మీద కొడాలి నాని అదే పనిగా విధేయత చూపడమే కారణమని.. అందరూ చెప్పుకున్నారు. చంద్రబాబును వ్యక్తిగత శత్రువుగా భావిస్తున్న కొడాలి నాని… ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ఇప్పటికీ.. ఆయన జూనియర్ ఎన్టీఆర్కు ఆప్తమిత్రుడిగా ప్రచారం చేసుకుంటూ .. తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుటూ ఉంటారు. ఈ లెక్కల్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి వచ్చిందని రాజకీయవర్గాలు భావించారు. కానీ కేశినేని నాని మాత్రం… కొడాలి నానికి మంత్రి పదవి రావడానికి.. దేవినేని ఉమ కారణమని.. ఆయనకు… కొడాలి నాని జీవితాంతం రుణపడి ఉండాలని… ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
దేవినేని ఉమపై… కొడాలి నాని అసంతృప్తిగా ఉన్నారని… కృష్ణా జిల్లా టీడీపీ నాయకులందరికీ తెలిసిపోయింది. అయితే.. అన్ని పార్టీల్లోనూ నేతల మధ్య ఆధిపత్య పోరాటం ఉంటుంది కాబట్టి..మామూలే అనుకున్నారు కానీ.. ఇప్పుడు కేశినేని నాని ఇప్పుడు… దీన్ని రోడ్డు మీదకు, సోషల్ మీడియాలోకి తెస్తున్నారు. కొద్ది రోజుల క్రితం… టీడీపీ ఆఫీసును.. తన కార్యాలయంలో పెట్టాలని నాని కోరారు. అయితే.. చివరి క్షణంలో గొల్లపూడిలోని టీడీపీ ఆఫీసులో పెట్టాలని నిర్ణయించుకున్నారు. దీనికి దేవినేని ఉమనే కారణం అని.. నాని భావించినట్లు చెబుతున్నారు. అందుకే ఇలా… తన కోపం తీర్చుకుంటున్నారని అంటున్నారు.
కొడాలి నాని మంత్రి అవడానికి దేవినేని ఉమ కారణం ఎలా అవుతారన్నదానిపైనా కేశినేని వర్గీయులు… విచిత్రమైన కారణాలు చెబుతున్నారు. కృష్ణా జిల్లా టీడీపీ అంతర్గత రాజకీయాల కారణంగానే.. కొడాలి నాని.. టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోయారని చెబుతారు. ఆ సమయంలో… చంద్రబాబు.. దేవినేని ఉమ మాటలకే ప్రాధాన్యం ఇచ్చి… కొడాలినాని పరిగణనలోకి తీసుకోలేదని.. ఈ కారణంగానే ఆయన పార్టీ మారాడని చెబుతున్నారు. ఇలా మారబట్టే.. ఇప్పుడు మంత్రి పదవి వచ్చిందన్న ఉద్దేశంలో.. కేశినేని నాని పోస్టు పెట్టాడని అంటున్నారు. మొత్తానికి కేశినేని సొంత పార్టీపై పోరాడితే పోయేదేమీ లేదు.. వస్తే.. గిస్తే… ఏమైనా వస్తాయని ఆశిస్తున్నారేమోనన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఏర్పడుతోంది.