నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఆయనను రిసీవ్ చేసుకోవడానికి వెళ్లిన సందర్భంలో జగన్ మోడీ కి వంగి వంగి దండాలు పెట్టడం పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కార్యకర్తల సమావేశంలో, ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సెటైర్లు వేసినట్లుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
మోడీ ని రిసీవ్ చేసుకునే సందర్భం లో జగన్ మోడీకి మంచి వంగి దండాలు పెట్టడం తెలిసిందే. ప్రధానమంత్రికి ఇంతగా భయపడే ఈయన ఇక రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంతో ఏం పోరాడతాడు అంటూ అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు కూడా మొదలయ్యాయి. గతంలో సోనియాగాంధీ వద్ద కిరణ్ కుమార్ రెడ్డి కాస్త వంగి నమస్కరిస్తూ మాట్లాడితే, ఆ విజువల్ ని సాక్షిలో పలుమార్లు చూపిస్తూ, జగన్ ఇలాంటివి చేయడు కాబట్టే పార్టీ నుండి బయటకు రావాల్సి వచ్చిందంటూ వ్యాఖ్యానాలు కూడా చేశారు సాక్షి వారు. ఇక సాక్షి లో వచ్చే కథనాలలో ” వెన్నెముక లేని నాయకులు” అన్న పదం ప్రస్తావించినప్పుడల్లా , కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీకి నమస్కరిస్తున్న విజువల్ కానీ, చంద్రబాబు మోడీ కి నమస్కరిస్తున్న విజువల్ కానీ చూపిస్తూ, వీరంతా వెన్నెముక లేని నాయకులు అన్న అభిప్రాయం కలిగేలా సాక్షి పలుమార్లు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే నిన్న జగన్ మోడీకి వంగి వంగి దండాలు పెట్టినప్పుడు మాత్రం, సాక్షి విజువల్ ని ఎడిట్ చేసి ప్రసారం చేయడం కూడా సోషల్ మీడియాలో విమర్శలను తెచ్చిపెట్టింది. వయసులో పెద్దవాళ్ళను గౌరవించడం లో తప్పు లేదని జగన్ చేసింది తప్పు కాదని వాదించే వైఎస్సార్సీపీ అభిమానులు సైతం, సాక్షి ఆ వీడియో ను ఎడిట్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే ఇదంతా ఒక ఎత్తయితే, నిన్న కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు. ప్రధానమంత్రి మోడీ అంటే తనకు గౌరవమే కానీ, భయం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడగల సత్తా తనకు ఉందని, కానీ రాష్ట్రాన్ని నడిపే నాయకులకు మాత్రం ప్రధానమంత్రి అంటే విపరీతమైన భయం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.