నిండా పంతొమ్మిదేళ్లు లేవు..
మీసాలు కూడా మొలకెత్తలేదు..
అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడదిన అనుభవం అస్సలు లేదు..
పైగా అవతల ఉన్నది ఆస్ట్రేలియా..
బ్రెట్‌లీ, మెక్‌గ్రాత్, ఫ్లెమింగ్ లాంటి అరివీర భయంకరమైన బౌలర్లు
గంటకు 150 మైళ్ల వేగంతో బంతులు విరురుతుంటే… సచిన్, గంగూలీ లాంటి దగ్గజాల బ్యాట్లే వణికిపోతున్నాయి.
అలాంటి సమయంలో ఆ కుర్రాడు నిలబడ్డాడు.. ఎదురొడ్డాడు.. పోరాడాడు
తొలి మ్యాచ్‌లోనే 84 పరుగులు సాధించి… భారత క్రికెట్ లో ఓ కొత్త తార వెలసిందని నిరూపించాడు. తనే యువరాజ్ సింగ్!
అప్పటి నుంచి ఆ పేరు వినిపిస్తూనే ఉంది. ఆ బ్యాటు మెరుస్తూనే ఉంది. గాయాలు ఇబ్బంది పెట్టినా, కాన్సర్ బూచి భయపెట్టినా, ఆ ఒడిదుడుకుల్ని ధైర్యంగా ఎదుర్కున్నాడు. ఇప్పుడు సెలవంటూ… అంతర్జాతీయ క్రికెట్ నుంచి సగౌరవంగా నిష్క్రమించాడు. తనే యువరాజ్ సింగ్.
భారత జట్టులో ఫీల్డర్లు చురుగ్గా ఉండలేరు.. అనే విమర్శని తిప్పికొట్టిన గొప్ప ఫీల్డర్ యువరాజ్. పాయింట్ దగ్గర యువీ పట్టుకున్న కళ్లు చెదిరిన క్యాచ్‌లు ఎన్నోసార్లు మ్యాచ్ స్వభావాన్నే మార్చేశాయి. మిడిల్ అర్డర్ లో వెన్నెముక్కలా నిలిచిన యువీ… చాలాసార్లు ఫినిషర్ అవతారం ఎత్తాడు. ధోనీని ఇప్పుడు గొప్ప ఫినిషర్‌గా ప్రపంచం అభివర్ణిస్తోంది. అయితే అంతకంటే ముందు ఆ బాధ్యత తీసుకున్నది యువరాజ్ సింగ్. ఛేదన సమయంలో యువీ బ్యాటింగ్ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. భారత్ లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు యువీ నాటౌట్‌గా నిలిచిన 27 సందర్భాల్లోనూ భారతే గెలిచింది. అదీ…. ఫినిషింగ్ టచ్ అంటే. భారీ లక్ష్యాలు చూసి మూర్చబోయే అలవాటుని మార్చేశాడు యువీ. ఇంగ్లండ్ లో జరగిన నార్త్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో కైఫ్‌తో కలసి అద్భుతం లిఖించాడు యువీ. 314 పరుగుల లక్ష్యాన్ని ఈ జంట ఛేదించి.. పరుగుల వేట ఎలా ఉండాలో నేర్పించాడు. అప్పటి నుంచి భారత జట్టుకు ఛేజింగులంటే భయం పోయింది.
ఇక బౌలింగ్ లో ఆపద్భాంధవుడి పాత్రని లెక్కలేనన్నిసార్లు పోషించాడు. 2011 వరల్డ్ కప్‌లో తనలోని అసలు సిసలైన ఆల్ రౌండర్ని బయటకు తీసుకొచ్చాడు యువీ. ఆ టోర్నీలో అటు పరుగులు.. ఇటు వికెట్లతో హోరెత్తించాడు. మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి 2011 వరల్డ్ కప్ ని భారత్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ధోనీ సేన టీ 20 కప్పు కొట్టడంలోనూ యూవీ పాత్రని మర్చిపోలేం. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి… ఇంగ్లండ్‌ని గజగజ వణించి – వరల్డ్ రికార్డు సృష్టించిన దృశ్యాలు ఇంకా మన కళ్ల ముందు సజీవంగానే ఉన్నాయి.
యూవీతో గాయాలు ఓ ఆట ఆడుకున్నాయి. బంతిని ఆపడానికి మైదానంలో విన్యాసాలు చేసే యువీనే మనం చూశాం. అయితే ఆ ప్రయత్నంలో ఎన్నిసార్లు శరీరాన్ని గాయ పరచుకున్నాడో..? ఆ గాయాలే.. ఆటకు దూరం చేశాయి. ఫామ్ కోల్పోయేలా చేశాయి. ఇదంతా ఒక ఎత్తయితే – కాన్సర్ మరో ఎత్తు. కాన్సర్ నుంచి యువీ కోలుకున్న విధానం, ఆ వెంటనే వరల్డ్ కప్‌లో చెలరేగిపోయిన తీరు చూస్తే యువీకి క్రికెట్ అంటే ఎంత మక్కువో అర్థం అవుతూనే ఉంది. అయితే ఆ తరవాత మళ్లీ ఎప్పటిలానే ఫామ్ తో ఇబ్బంది పడ్డాడు. అడపా దడపా బ్యాటు ధుళిపించినా – మునుపటి జోరు కనిపించలేదు. చిన్న జట్లపైనా తక్కువ స్కోర్లే. ఐపీఎల్‌లోనూ… చేదు అనుభవాలే. దాంతో.. అంతర్జాతీయ క్రికెట్ కి యువీ దూరం అయ్యాడు. తిరిగి ఫామ్ లోకి వచ్చి, మళ్లీ భారతజట్టులో చోటు సంపాదించడం దాదాపు అసాధ్యమైపోయింది. అందుకే….. గౌరవంగా ఆట నుంచి తప్పుకున్నాడు. భారత జట్టుకు ఎంతో మంది స్టార్లు రావొచ్చు. వెళ్లొచ్చు. కానీ యువీ ప్రస్థానం మాత్రం ప్రత్యేకం. తన ఆటనీ, ఆట కోసం తను పడిన కష్టాన్నీ, తను అందించిన విజయాల్నీ క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోరు. ధ్యాంక్యూ యూవీ..!!