తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ దూకుడైన రాజకీయంతో.. సీఎల్పీ నేత పదవిని.. నాలుగైదు నెలల్లోనే పోగొట్టుకున్న మల్లు భట్టి విక్రమార్క… ప్రభుత్వంపై తెగెవరూపోరాడుతానని… ఆమరణదీక్ష ప్రారంభించారు. కానీ అనూహ్యంగా సోమవారం మధ్యాహ్నం ఆయనకు… తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలే.. నిమ్మరసం తాగించేశారు. దీంతో అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందా.. అని ఆరా తీస్తే.. చాలా విషయాలు బయటకు వస్తున్నాయి.
భట్టి దీక్ష విరమణ వెనుక కేవీపీ మంత్రాంగం..!
కాంగ్రెస్ పార్టీ నేత కెవీపీ రామచంద్రరావు.. మల్లు భట్టి విక్రమార్క దీక్ష విరమణ వెనుక కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. భట్టివిక్రమార్క దీక్ష వ్యవహారం.. ప్రజల్లో.. చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలు వీడిపోవడం.. టీఆర్ఎస్ లో విలీనం అంటూ…వారం రోజులుగా జరుగుతున్న చర్చ… కాంగ్రెస్ పోరాటం నేపధ్యంలో… ప్రజలు ఈ అంశంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో.. భట్టి దీక్ష.. దానికి మరింత ఆజ్యం పోసింది. అందుకే మొదట 36గంటల దీక్ష అన్న భట్టి… స్పందనను చూసి ఆమరణదీక్షగా మార్చుకున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఉలిక్కి పడాల్సి వచ్చింది. ఆమరణదీక్ష ప్రజలకు నచ్చితే… ఫలితం ఎలా ఉంటుందో.. టీఆర్ఎస్కు తెలుసు కాబట్టి.. వెంటనే… తన మార్క్ ఆపరేషన్ ప్రారంభిచిందని అంటున్నారు. అందులో భాగంగానే.. కేవీవీ రామచంద్రరావు రంగంలోకి దిగారంటున్నారు.
భట్టితో దీక్ష విరమింపచేయాల్సిన అవసరం కేవీపీకి ఏమిటి..?
భట్టివిక్రమార్క దీక్ష విరమణ కోసం.. కేవీపీ.. కాంగ్రెస్ పార్టీ పెద్ద నేతలపై ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. వైఎస్ హయాంలో.. కేవీపీ చెప్పిందే వేదం. కాంగ్రెస్ పార్టీ నేతలందరూ.. ఇప్పటికీ ఆయన చెప్పిన మాటకు గౌరవం ఇస్తారు. ఆయన వల్ల అవకాశాలు దక్కించుకున్న వారు అనేక మంది ఉండటమే దీనికి కారణం. చివరికి మల్లు భట్టివిక్రమార్క ఆయన సోదరుడు మల్లు రవి కూడా.. కేవీపీకి అమితమైన గౌరవం ఇస్తారు. ఈ పరిచయాలు, మొహమాటాలను.. కేవీపీ సరిగ్గా ఉపయోగించుకుని భట్టి విక్రమార్కతో.. దీక్ష విరమింప చేశారని చెబుతున్నారు. అందుకే.. దీక్షను విరమించిన తర్వాత.. కేవీపీ ఆస్పత్రికి వచ్చి భట్టిని పరామర్శించారని అంటున్నారు. చాలా రోజులుగా.. టీఆర్ఎస్ తో.. కేవీపీకి సన్నిహిత సంబంధాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
ఏఐసిసి నేతల్ని పిలిపించి దీక్ష విరమించాలనుకున్న భట్టి..!
నిజానికి భట్టి దీక్షకు.. ప్రజల్లో అనూహ్యమైన మద్దతు రావడంతో… కాంగ్రెస్ నేతలు కొత్త ప్రణాళికలు వేశారు. దీక్షపై టెంపో ఇంకొంచెం పెంచి… ఏఐసిసి నేతల్ని పిలిపించాలనుకున్నారు. అలా చేయడంతో… విలీనం అంశం మరింత పకడ్బందీగా ప్రజల్లోకి వెళ్తుందని అనుకున్నారు. కానీ… ఇక్కడ తెలంగాణ నేతలు మాత్రం.. రాహుల్ సూచించారనే.. భట్టి దీక్ష విరమించారంటూ… ఓ ప్రచారాన్ని ప్రారంభించి.. పని పూర్తి చేశారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో కేవీవీ పవర్ ఏ మాత్రం.. తగ్గలేదని మరోసారి నిరూపితమైందని.. కొంత మంది నేతలు గొణుక్కోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.