రాష్ట్ర విభజన జరిగిన మొదట్లో.. రెండు రాష్ట్రాల మధ్య ఓ భిన్నమైన వాతారణం ఉండేది. మిగులు రాష్ట్రం తెలంగాణ… ఉద్యోగులకు ఊహించిన దాని కన్నా ఎక్కువగా ఐఆర్, పీఆర్సీ ఇచ్చింది. లోటు రాష్ట్రమైనా.. ఉద్యోగుల్ని..నిరాశపరచకూడదని… చంద్రబాబు కూడా… ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. కేసీఆర్.. ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వకుడా నాన్చుతున్నారు. కానీ జగన్ మాత్రం… 27 శాతం ఐఆర్ ప్రకటించేశారు. అలాగే.. తాను ఆలోచిస్తున్న మరికొన్ని నిర్ణయాలనూ.. జగన్ తీసేసుకున్నారు. దీంతో ఇప్పుడు.. పోలికలు ప్రారంభమయ్యాయి.
ఏపీ ప్రభుత్వం తీసుకొన్న కొన్ని నిర్ణయాలు తెలంగాణా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఆర్టీసీతో పాటు వివిధ చిరు ఉద్యోగుల జీతాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.. జూలై నుండి ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని నిర్ణయించారు. సీపీఎస్ రద్దుపై కమిటీని నియమించారు. దీంతో తెలంగాణలోని ఉద్యోగ వర్గాల్లో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది..2018 జూలై నుండే కొత్త పీఆర్సీ అమలు కావాల్సింది. వేతనాల పెంపు కోసం కమిటీని నియమించి ఏడాది దాటింది. ఇంకా పీఆర్సీ కమిటీ నివేదిక కూడా ఇవ్వలేదు. కనీసం మధ్యంతర భృతి కూడా ప్రకటించలేదు. ఏపీ ప్రభుత్వం 27 శాతం ఐఆర్ జూలై నుండి ఇస్తామని ప్రకటించింది.సీపీఎస్ రద్దుపై కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ వర్గాల నుండి తెలంగాణా ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతోంది..
ఆర్టీసీ విషయంలోను సానుకూల నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం కోసం కమిటీ ని నియమించింది. కానీ తెలంగాణా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో కఠినంగా వ్యవహరించింది. సమ్మె చేస్తే అవసరమైతే ప్రైవేటు పరం చేస్తామని స్వయంగా సీఎం కేసీఆరే హెచ్చరించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏపీ తరహాలో తెలంగాణా ప్రభుత్వం కూడా ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయమనే డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్న చర్చ తెలంగాణ వర్గాల్లో వినిపిస్తోంది.