జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటమి హ్యాంగోవర్ నుంచి పూర్తిగా బయటపడ్డారు. రెండు వారాలు కూడా పూర్తి కాక ముందే ఆయన భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. ప్రాంతాల వారీగా.. ఎన్నికల ఫలితాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమీక్షల్లో బయట పడుతున్న అంశాలతో.. అప్పుడప్పుడూ ఆయన ఆవేశానికి గురవుతున్నారు. అయినా…తన రాజకీయ వ్యూహంపై మాత్రం పక్కా ఆలోచనతోనే ఉన్నారు. అందుకే.. ఇక నుంచి తన రాజకీయం అంటే ఏమిటో చూపిస్తానని చెబుతున్నారు.
సంప్రదాయ రాజకీయాలు ప్రారంభించబోతున్నారా..?
సమీక్షల్లో.. డబ్బు ప్రభావం వల్లే తాము ఓడిపోయామనే.. నిర్ణయానికి.. పవన్ కల్యాణ్ వచ్చారు. ముఖ్యంగా తనను.. అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఉండేందుకు…రూ. 150 కోట్లు ఖర్చు చేశారనే కచ్చితమైన సమాచరం రావడంతో.. పవన్ కల్యాణ్ మరింత పట్టుదల ప్రదర్శిస్తున్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని.. తనేంటో చూపించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జనసేనను…కొత్త పద్దతిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ.. ఇతర పార్టీల కంటే.. భిన్నమైన రాజకీయం చేశారు. హంగులు, ఆర్భాటాలు, ఓట్ల కొనుగోళ్లు, నేతలను ఆకర్షించడం వంటి వాటికి దూరంగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు.. వాటినే ఇతర రాజకీయ పార్టీలు , నేతలు చేతకాని తనం అన్నట్లుగా చూస్తూండటంతో.. పంధా మార్చుకుని… సంప్రదాయ రాజకీయాలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక తన మార్క్ రాజకీయం చూస్తారని పవన్ కల్యాణ్ అనడంలోని ఉద్దేశం అదే నంటున్నారు.
గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తారా..?
పార్టీ బలోపేతం కోసం.. గ్రామస్థాయిలో ..కమిటీల ఏర్పాటును ప్రారంభించబోతున్నట్లుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి. నిజానికి జనసేన పార్టీ ప్రారంభించి.. దాదాపు.. ఆరేళ్లు అవుతున్నప్పటికీ.. ఇంత వరకూ.. సరైన వ్యవస్థ లేదు. పై స్థాయిలోనే అంతంతమాత్రంగానే కార్యనిర్వహణ వ్యవస్థ ఉంది. ఇక కింది స్థాయిలో.. అదీ గ్రామస్థాయిలో అసలు లేదు. అందుకే పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు. నిజానికి పవన్ కల్యాణ్ కు ఫ్యాన్ బేస్ ఎక్కువ. ప్రతీ గ్రామంలోనూ.. ఆయనకు అభిమానులు ఉంటారు. అయితే.. పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల.. అభిమానులతో కూడా ఓట్లు వేయించుకోలేకపోయారు. సమీక్షల్లో అదే బయటపడింది. తాము పవన్ కల్యాణ్ ఫ్యాన్సే అయినప్పటికీ.. వైసీపీకి ఓటు వేశామని పలువురు చెప్పారు. ఇలాంటి పరిస్థితి రావడానికి.. పార్టీ తరపున బూత్ లెవల్లో.. నిర్మాణం లేకపోవడమే కారణం. ఇతర పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నేతల్ని కూడా.. ఆహ్వానిస్తారని అంటున్నారు.
మాటల్లో కాదు.. చేతల్లో చూపించాల్సిన సందర్భం..!
పవన్ ముందు ఉన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ఎన్నికలకు ముందు జనసేన వేరు.. ఇప్పుడు ఉన్న జనసేన వేరు. ఎన్నికలకు ముందు జనసేన బలం ఎంతో ఎవరికీ తెలియదు. అందుకే ఓ ప్రధాన శక్తిగా ఉన్నారు. కానీ.. ఇప్పుడు.. ఆ పార్టీకి ఆరు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. స్వయంగా .. పవన్ కల్యాణ్.. రెండు చోట్ల ఓడిపోవడంతో… జనసేనను ఓ ఫోర్స్ గా చూడటానికి.. ఏపీలోని ప్రధాన పార్టీలు సిద్ధపడే అవకాశం లేదు. అదే సమయంలో.. జనసేనలో ఉన్న కొద్ది మంది నేతలను పవన్ కల్యాణ్…కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే.. మాజీ మంత్రి రావెల కిషోర్ బీజేపీలో చేరిపోయారు. నాదెండ్ల మనోహర్ పై కూడా ఇలాంటి వదంతులే వచ్చాయి. అది మైండ్ గేమ్ అయినా.. మరొకటి అయినా… ఇలాంటి రాజకీయాలు జనసేన కేంద్రంగా చాలా జరుగుతాయి. పవన్ కల్యాణ్ వీటన్నింటినీ ఎదుర్కొని.. తన మార్క్ రాజకీయాలేమిటో చూపించాల్సి ఉంది. అప్పుడే.. జనసేన పార్టీ మళ్లీ ఎన్నికల వరకూ నిలబడుతుంది. లేకపోతే.. తేడా వస్తుంది.