ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర్నుంచీ ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి పక్కా అని అందరూ అనుకున్నారు. ఆమెకు దక్కపోయే శాఖలపై కూడా రకరకాల అభిప్రాయాలు చక్కర్లు కొట్టాయి. ఎన్నికలకు ముందు రాజకీయంగా టీడీపీపై బలమైన మాటల దాడి చేసిన ఫైర్ బ్రాండ్ గా రోజా గుర్తింపు తెచ్చుకున్నారు. కాబట్టి, ఆమెకి మంత్రి పదవి గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. కానీ, సీఎం జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో ఆమెకి చోటు దక్కలేదు. దీంతో ఆమె కాస్త అసంతృప్తికి గురయ్యారన్న కథనాలూ వచ్చాయి. తనకు పదవి దక్కలేదన్న కారణంతోనే మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆమె రాలేదన్న ఊహాగానాలు వినిపించాయి. ఫోన్లో కూడా ఎవ్వరికీ అందుబాటులో లేకుండా పోయారన్న కథనాలు వచ్చాయి. అయితే, ఇవాళ్ల ఆమెకు సీఎం నుంచీ ఫోన్ వెళ్లిందన్న కథనాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై ఎమ్మెల్యే రోజా స్పష్టత ఇచ్చారు.
తాను ఎవరిమీదా అలగలేదనీ, మంత్రి పదవి రాకపోవడంపై అసంతృప్తిగా లేనని ఆమె అన్నారు. ప్రమాణ స్వీకారం రోజున రాకపోవడానికి కారణం తనకు పదవి రాకపోవడం కాదన్నారు రోజా. ప్రమాణ స్వీకారం చేసేవాళ్లు మాత్రమే ఉంటారు తప్ప అందరూ ఉండాల్సిన అవసరం ఏముందన్నారు? ఎమ్మెల్యేలు అందరూ ఆరోజు అక్కడ ఉండాలని ఎవ్వరూ చెప్పలేదన్నారు. ఇప్పుడు కూడా తనకు సీఎం ఆఫీస్ నుంచి కాల్ రాలేదనీ, రేపు అసెంబ్లీ ఉంది కాబట్టి విజయవాడకు చేరుకున్నా అన్నారు రోజా. తనకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో కూడా వాస్తవం లేదన్నారు.
కేబినెట్ లో చోటు దక్కకపోవడానికి కారణం తనకూ తెలీదనీ, ఆప్రశ్నను ముఖ్యమంత్రిని అడగాలన్నారు రోజా. కుల సమీకరణ ప్రకారం పదవులు ఇచ్చారు కాబట్టి, ఆ లెక్కల్లో తాను ఫిట్ కాలేకపోయానేమో అన్నారు. తనకు చిన్నప్పట్నుంచీ కులం మీద వ్యామోహం లేదనీ, దాన్ని పెద్దగా పట్టించుకోననీ, తన భర్త కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాదన్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం కుల సమీకరణలు అంటున్నారనీ, అదీ మంచిదేననీ, వారికీ అవకాశాలు దక్కుతాయన్నారు. ముఖ్యమంత్రి తనను పిలిస్తే వెళ్లి కలుస్తానని ఆమె చెప్పారు. మొత్తానికి, ఆమె మాటల్లో కొంత అసంతృప్తి ఉందన్నది స్పష్టంగా కనిపిస్తోంది.