టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల కుటుంబం పై ఫిర్యాదులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత ఐదేళ్ళలో కోడెల కుమారుడు, కుమార్తెలు బెదిరించారని ఆరోపిస్తూ.. పలువురు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో కోడెల శివప్రసాద్ స్పీకర్ గా ఉన్న సమయంలో ఆయన కుమారుడి శివరాం, ఆయన కూతురు పూనాటి విజయలక్ష్మి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. భూకబ్జా లు, సెటిల్ మెంట్ లు , ఉద్యోగాలు ఇప్పిస్తామని నగదు వసూళ్ళు, బిల్డింగ్ లు కట్టుకోవాలంటే కప్పం చెల్లించాలని ఇలా అనేక రకాలుగా దోపిడిలకు పాల్పడ్డారని.. దీనికి కే ట్యాక్స్ అని వైసీపీ నేతలు ప్రచారంచేశారు.
సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలలో కే టాక్స్ పేరుతో కోడెల కుటుంబం ప్రజలను దోచుకుంటుందని జగన్ పాదయాత్ర సమయంలో బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఆ తరువాత వైసిపి తో పాటు ప్రతిపక్ష పార్టీలు కే టాక్స్ ను బాగా ప్రచారం చేశారు. ఇప్పుడు వైసిపి అధికారం లోకి రావడంతో ఒకే రోజు.. కోడెల కుమార్తె, కుమారుడుపై కేసులు నమోదయ్యాయి. విజయసాయి రెడ్డి కోడెల కుటుంబ బాధితులు ధైర్యంగా బయటకు పోలీసుల ఫిర్యాదు చేయాలని పిలుపునివ్వడంతో… పలువురు పోలీస్ స్టేషన్లకు వస్తున్నారు.
విజయ సాయి రెడ్డి ప్రకటన నుంచి రోజకోకరు బాధితులు పోలీసులు ఫిర్యాదులు చేస్తున్నారు. నరసరావుపేట తో పాటు సత్తెనపల్లి నియోజకవర్గం లోని పలు స్టేషన్ లకు బాధితులు క్యూ కడుతున్నారు. కోడెల కుమారుడు శివరాం, కుమార్తె పూనాటి విజయలక్ష్మి లతో పాటుగా వారి వ్యక్తిగత సహయకులు, ప్రధాన అనుచరుల పై కూడా పోలీసులుకు ఫిర్యాదు చేస్తున్నారు. వీటిల్లో ఇప్పటికే కొన్ని ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేయగా మిగిలిన ఫిర్యాదుల పై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఫిర్యాదుల పరంపర పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.