వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. లోక్సభలో సంప్రదాయకంగా.. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇస్తూంటారు. అందుకే.. ఈ సారి ఆ పదవిని.. వైసీపీకి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత లోక్సభలో .. ఆ పదవిని.. అన్నాడీఎంకే ఎంపీ తంబిదురైకి ఇచ్చారు. ఈ సారి అన్నాడీఎంకే ఒక్క సీటుకే పరిమితమయింది. లోక్సభలో..ఎక్కువ మంది ఎంపీలున్న పార్టీల్లో ఒకటిగా ఉంది. అందుకే.. ఈ సారి ఆ పదవిని.. వైసీపీకి ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు.. ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. అమరావతికి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై వైసీపీ ఇంత వరకూ.. ఎలాంటి స్పందననూ వ్యక్తం చేయనప్పటికీ… బీజేపీ ఆఫర్ ను కాదనలేని పరిస్థితి ఉంది. గిరిజన ఎంపీకి.. డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇస్తే ఎలా ఉంటుందా.. అన్న చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. నిజానికి భారతీయ జనతా పార్టీ.. ఫ్రెండ్లీ ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించుకోవడంతోనే వైసీపీ వైపు చూస్తోంది. నిజంగా ప్రతిపక్షానికే అవకాశం ఇవ్వాలనుకుంటే.. కాంగ్రెస్ పార్టీ ఎంపీకి ఇస్తారు. ఎందుకంటే.. ఆ పార్టీకి 52 మంది ఎంపీలు ఉన్నారు. కానీ.. బీజేపీ ఫ్రెండ్లీ ప్రతిపక్షానికి ఇవ్వాలనుకుంటోంది. అది ఆ పార్టీ విధానం కూడా.
ఎన్డీఏలో లేకుండా.. బయట ఉండి.. తమకు పూర్తి స్థాయిలో సహకరించే పార్టీకి ఈ పదవి ఇస్తున్నారు. గతంలో అన్నాడీఎంకే అలాగే వ్యవహరించింది. ఇప్పుడు వైసీపీ కూడా.. అలాగే వ్యవహరిస్తుంది కాబట్టి… ఆ పదవికి వైసీపీని ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఒడిషాకు చెందిన బిజూ జనతాదళ్ ఎంపీకి ఇస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ.. బీజేపీ వ్యూహం మార్చుకున్నట్లు చెబుతున్నారు.