ఓటర్ సినిమా వివాదాల్లో కూరుకుపోతోంది. క్రెడిట్స్ విషయంలో దర్శకుడు జి.ఎస్.కార్తీక్కీ, మంచు విష్ణుకీ మధ్య వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ కథ నాదంటే నాదని…. అటు హీరో, ఇటు దర్శకుడు కయ్యానికి కాలు దువ్వుకుంటున్నారు. దాంతో పాటు… సినిమా అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.సినిమా పూర్తయినా విడుదల చేయలేని పొజీషన్. ఇంకా విడుదల చేయకపోతే.. వడ్డీలకు పైగా వడ్డీలు కట్టాల్సివస్తుంది. అందుకే.. ఈనెల 21న ఈ సినిమాని విడుదల చేయాలని నిర్మాత ఫిక్సయ్యాడు. చిత్రబృందం కూడా విడుదల తేదీని ప్రకటించింది.
అయితే… ఈ సినిమాని అడ్డుకోవాలని మంచు విష్ణు భావిస్తున్నట్టు సమాచారం. వివాదం కొలిక్కి రాకుండా ఈ సినిమాని విడుదల చేయకూడదని ఆయన దర్శక నిర్మాతల్ని హెచ్చరిస్తున్నాడట. తన సినిమా విడుదల కాకుండా, ఓ హీరో అడ్డు కోవడం బహుశా.. ఇదే తొలిసారేమో. అంతేకాదు.. సినిమా ప్రమోషన్లకు రానని, ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడనని తెగేసి చెబుతున్నాడని తెలుస్తోంది. మరోవైపు దర్శకుడు కూడా ఈ సినిమా గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా కలగ చేసుకోలేదని సమాచారం. అటు హీరో, ఇటు దర్శకుడు వదిలేసిన సినిమా ఇది. నిర్మాతే తన భుజాలపై వేసుకుని రిలీజ్ గుమ్మం వరకూ తీసుకొచ్చాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.