తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల హామీలు నెరవేర్చడం… కష్టంగా మారిపోతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ రూ. రెండు లక్షల ఒకే సారి రుణమాఫీ హామీతో పాటు.. అనేక సంక్షేమ పథకాలు ప్రకటించింది. రైతులు ఎక్కడ కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతారోనని.. టీఆర్ఎస్ కూడా.. రుణమాఫీ పథకం ప్రకటించింది. అయితే.. రూ. లక్ష మాత్రమే.. ప్రకటించింది. అదీ ఒకే సారి చేస్తామని ఎన్నికల ప్రచార సభల్లో కేటీఆర్ హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆ హామీలన్నీ అమలు చేయడం తలకు మించిన భారంగా.. సర్కార్కు మారింది. ముఖ్యంగా రూ. లక్ష రుణమాఫీని ఎలా చేయాలని తంటాలు పడుతోంది. నిధుల అన్వేషణ చేస్తోంది.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. రూ. లక్ష రుణమాఫీ చేయడానికి బ్యాంకర్ల వద్ద నుంచి సమాచారం తీసుకున్నారు. ఇవి రూ. 24 వేల కోట్లున్నట్లు తేలింది. ఒకే సారి మాఫీ చేయడం అసాధ్యం కాబట్టి… నాలుగు విడతలుగా చెల్లించాలని నిర్ణయించారు. ఈ రుణాలను ఏటా ఆరువేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కూడా ప్రకటించారు. ఈ ఏడాదిలో ఎప్పుడు చెల్లిస్తారనే దానిపై స్పష్టత లేదు. రైతు బంధు కోసం రూ. 6900 కోట్లు విడుదల చేసారు. ఆసరా పెన్షన్లను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరో రెండు,మూడు నెలల పాటు నిధుల కొరత తీవ్రంగా ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పు తీసుకుంటే తప్ప పెద్ద పద్దులు చెల్లించే స్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదు. ఆగస్టులో బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన తర్వతా మరో విడత అప్పు తీసుకోవాలని నిర్ణయించారు. ఆ సమయంలో వచ్చే నిధులతో సెప్టెంబరు మొదటి వారంలో మొదటి విడతగా రూ. ఆరు వేల కోట్లు రుణమాఫీకి నిధులు విడుదల చేయాలనే యోచనలో ఉన్నారు. రుణమాఫీ నిధులను చెక్కుల రూపంలో నేరుగా రైతులకు అందించాలనుకుంటున్నారు. బ్యాంకర్లతో సంబంధం లేకుండా చూసుకుంటున్నారు. ఏలా చూసినా ఈ ఏడాది చివర మాత్రమే.. రుణమాఫీ తొలి విడత విడుదల చేసే అవకాశం ఉంది.