రోజాకు.. ఎట్టకేలకు కీలక పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు చైర్మన్ పదవి ఇచ్చారు. తొమ్మిదేళ్లు జగన్మోహన్ రెడ్డితో పాటు నడిచినా.. చివరికి పార్టీ గెలిచిన తర్వాత మంత్రి పదవి రాకపోవడంతో.. ఆమె అసంతృప్తికి గురయ్యారు. ప్రమాణస్వీకారం రోజు విజయవాడలో ఉండి.. ఆ తర్వాత నగరి వెళ్లిపోయారు. రోజా అసంతృప్తికి గురయిన విషయం తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి… పిలిపించి మాట్లాడారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి ఇస్తామని.. ఇప్పటికి.. నామినేటెడ్ పోస్ట్‌తో సరిపెట్టుకోమని సూచించారు. అదీ కూడా కీలకమైన పదవి ఇస్తామని చెప్పడంతో రోజా అంగీకరించారు. ఆమెకు.. ఏపీఐఐసి చైర్మన్ పోస్ట్‌ను కేటాయించారు.
ఓ రకంగా.. నామినేటెడ్ పదవుల్లో ఇది అగ్రశ్రేణికి చెందినదిగా చెప్పుకోవచ్చు. పరిశ్రమలకు భూముల కేటాయింపు దగ్గర్నుంచి మౌలిక సదుపాయాలు కల్పించడం వరకూ.. వివిధ సందర్భాల్లో ఏపీఐఐసీ కీలకపాత్ర పోషిస్తుంది. దండిగా నిధులు కూడా ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అంబటి రాంబాబు.. ఈ పదవి నిర్వహించారు. ఆ సమయంలో.. ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి కూడా. ఇప్పుడు అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. దాంతో.. ఆ పదవికి ఆయన పేరు పరిశీలిస్తారని అనుకున్నారు.
అదే సమయంలో.. ఎన్నికలకు ముందు… తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీఘాకొళ్లపు శివరామసుబ్రహ్మణ్యం అనే నేతను.. జగన్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. కండువా కప్పారు. అంబటి రాంబాబు తర్వాత … రోశయ్య హయాంలో..ఈయనే ఏపీఐఐసీ చైర్మన్ గా వ్యవహరించారు. అప్పుడు టిక్కెట్ ఇవ్వలేదు కాబట్టి.. ఇప్పుడు మరోసారి ఆయనకు అదే పదవి ఇస్తారని అనుకున్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి ఇద్దర్నీ పరిగణనలోకి తీసుకోలేదు. రోజాకు ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రి పదవి దక్కపోయినా రోజాకు..కాస్త ఊరట లభించిందని చెప్పుకోవాలి.