ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు మరోసారి తెరమీదికి రాబోతున్నాయి. ఈ దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారని సమాచారం. నిజానికి, ఈ అభివృద్ధి మండళ్లు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఉండేవి. ఉమ్మడి రాష్ట్రంలో మూడు మండళ్లు… అంటే, తెలంగాణ, రాయలసీమ, కోస్తాలుగా ఉండేవి. అయితే, ఇప్పుడు వాటి సంఖ్యను 5కి పెంచాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. తన తండ్రి హాయాంలో మాదిరిగానే మండళ్లను కొనసాగించాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ఉత్తరాంధ్ర, కోస్తా, కృష్ణా – గుంటూరు, ప్రకాశం, నెల్లూరు – రాయలసీమ… ఇలా ఐదు మండళ్లు ఏర్పాటు చేసి, ఒక్కో దానికి ప్రత్యేకంగా బోర్డులు, ఐదుగురు ఛైర్మన్లను ఏర్పాటు చేస్తారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.
ఇంతకీ, ఇప్పుడీ మండళ్ల ఏర్పాటు కొత్తగా ఎందుకూ అంటే… పాలనలో మరింత సౌలభ్యం కోసమే అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. అవినీతి రహిత పాలన అందిస్తామంటున్న ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా ఈ మండళ్లు పని చేస్తాయనీ, అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయడంలో ఇవి దోహదపడతాయన్నది ప్రభుత్వ ఆలోచన అంటున్నారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులతోపాటు, జరగాల్సిన పనులపై కూడా ఈ మండళ్లు ఎప్పటికప్పుడు పనిచేస్తుంటాయి. మంత్రి వర్గ ఏర్పాటులో కూడా ప్రాంతాలవారీగా కీలక పదవులు ఉండేట్టు సీఎం జాగ్రత్తలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సమాంతరంగా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు కూడా ఉంటే… మరింత బాగుంటుందనేది సీఎం అభిప్రాయంగా చెబుతున్నారు.
ఈ నిర్ణయాన్ని రాజకీయ కోణం నుంచి చూసుకుంటే… మంత్రి మండలిలో స్థానం దక్కని అసంతృప్త ఎమ్మెల్యేలు వైకాపాలో కొంతమంది ఉన్నమాట వాస్తవమే. అయితే, అందరికీ న్యాయం చేస్తానన్న సీఎం జగన్ మాటపై నమ్మకంతో.. అసంతృప్తులు బయటకి రావడం లేదు. కానీ, పార్టీకి కీలకంగా పని చేసినవారందరినీ ఎక్కడో ఒక చోట, వీలైతే ఇప్పుడే ఏదో ఒక పదవి ఇవ్వాలనే బాటలోనే సీఎం ఉన్నారన్నది అర్థమౌతూనే ఉంది. ఇప్పుడీ అభివృద్ధి మండళ్లను తెర మీదికి తేవడం వల్ల… ఐదుగురుకి కేబినెట్ హోదాతో కూడిన ఛైర్మన్ పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయంగా చూసుకుంటే ఈ మండళ్ల సంఖ్య పెంపు వెనక ఈ కోణం కూడా ఉందని చెప్పొచ్చు.