ఇది వరకు సినీ తారల సందడంతా తెలుగుదేశంలోనే ఉండేది. సినీ గ్లామర్ టీడీపీకి అదనపు ఆకర్షణగా మారేది. కానీ ఈసారి లెక్క మారింది. జగన్ గెలుస్తాడని ముందే ఊహించిన సినిమావాళ్లు… వైకాపా పార్టీలోకి క్యూ కట్టారు. సీటు దక్కుతుందన్న నమ్మకం లేకపోయినా, ఆ భరోసా ఇవ్వకపోయినా.. జగన్ వెంటనే ఉన్నారు. పోసాని, ఫృథ్వీ అయితే విస్క్కృతంగా ప్రచారం చేశారు. పృథ్వీ జగన్ గెలవాలని గుండు కూడా కొట్టించుకొచ్చాడు. పార్టీ టికెట్ దక్కదని తెలిసినా, స్నేహితుడు పవన్ కల్యాణ్ ఫీలవుతాడని గ్రహించినా, అలీ ఖాతరు చేయలేదు. జగన్ పార్టీలోకి జంప్ అయ్యాడు. చివరి నిమిషంలో జీవిత, రాజశేఖర్ వైకాపా ఫ్లైట్ ఎక్కేశారు. సినిమా అవకాశాల్లేని చిన్నికృష్ణలాంటి వాళ్లు… క్లైమాక్స్‌లో తమ ఫైర్ చూపించారు. ఇలా సినిమా వాళ్లకు వైకాపా అడ్డాగా మారిపోయింది.
వాళ్లనుకున్నట్టే వైకాపా భారీ మెజారిటీతో గెలిచింది. జగన్ సీఎం అయ్యాడు. సినిమావాళ్ల కలలన్నీ ఫలించాయి. ఇప్పుడు కొత్త కలలు వికసిస్తున్నాయి. ఎం.ఎల్.ఏ సీటు ఎలాగూ దక్కలేదు. కనీసం ఇప్పుడు నామినేటెడ్ పదవులన్నా దక్కుతాయని ఊహల్లో ఊరేగుతున్నారంతా. ఎన్నికల సమయంలో తాము పడిన కష్టం వృథా పోదని, తప్పకుండా జగన్ నుంచి పిలుపు వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఫృథ్వీ, పోసాని లాంటివాళ్లకయితే… నమ్మకాలు ఇంకాస్త బలంగా ఉన్నాయి. తరచూ వైకాపా పెద్దలతో వీరిద్దరూ టచ్‌లో ఉన్నారని వినికిడి. రాజ్యసభకు వెళ్తామని కొందరు, చలన చిత్రసీమతో సంబంధం ఉండే నామినేటెడ్ పోస్టులు వస్తాయని ఇంకొందరు, ఇప్పుడు కాకపోయినా – వచ్చే ఎన్నికల్లో అయినా సీటు దక్కించుకోవచ్చని మరి కొందరు. ఇలా ఎవరి అంచనాలు వాళ్లవి. మరి జగనన్న కనికరిస్తాడో లేదో చూడాలి.