షర్టర్లు మూసేసే వయసులో దుకాణం తెరిస్తే ఎలా ఉంటుంది?
పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన ఏజ్‌లో… బ్యాటింగ్‌కి దిగుతానంటే ఏమవుతుంది?
ఎండిపోయిన చెట్టుకు నీళ్లేసి, పూలు పూయించాలని చూస్తే జరుగుతుంది?
– ఈ ప్రశ్నలకు సమాధానం ‘మన్మథుడే’ ఇవ్వగలడు. వయసైపోయిన ఓ ‘వర్జిన్’ పెళ్లి చేసుకోవాలని చూసే ప్రయత్నాల సమాహారం ‘మన్మథుడు 2’. నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఆగస్టు 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు టీజర్ వచ్చింది.
ఆ మన్మథుడు పెళ్లికి దూరం. ఇప్పటి మన్మథుడు పెళ్లికి మాత్రమే దూరం. అమ్మాయిల్ని పడేయడంలోనూ, వాళ్లని ముద్దు మురిపాలలో ముంచేయడంలోనూ మహా దిట్ట. ఇంట్లో అందరికీ వర్జిన్ అని కోటింగ్ ఇచ్చే పూలరంగడు. ఇవన్నీ టీజర్లోనే చూపించేసి, తాను చెప్పదలచుకునే కథ ఎలా ఉంటుందో ఓ హింట్ ఇచ్చేశాడు దర్శకుడు. ఏమాటకామాట చెప్పుకోవాలి. మన్మథుడు అనే టైటిల్ నాగ్‌కి ఎందుకు సూటవుతుందో, అతనికి మాత్రమే ఎందుకు నప్పుతుందో ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. నాగ్ వయసు మరో ఇరవై ఏళ్లు తగ్గినట్టు అనిపిస్తుంది. అప్పటి `మన్మథుడు`లో నాగ్ ఎలా ఉన్నాడో.. ఇప్పటికీ అలానే ఉన్నాడు. `ఐ యామ్ నాట్ ఫాలో ఇన్, ఐ మేక్ లవ్` అంటూ నాగ్‌తో చెప్పించారు. దాన్ని బట్టి ఈ సినిమాలో నాగార్జున పాత్ర ఎలా ఉంటుందో అర్థమైపోతోంది. హాట్ సీన్లూ, లిప్ లాక్కులూ కలగలిపి, ఈనాటి ట్రెండ్‌కి తగ్గట్టు మన్మథుడిని తీర్చిదిద్దాడు దర్శకుడు. మరి… ఈసారి నాగ్ ఎలాంటి మాయాజాలం చేస్తాడో చూడాలి.