వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని వారితో రాజీనామా చేయించకపోవడం… పైగా మంత్రి పదవులు ఇచ్చిన వైనాన్ని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు ఉపయోగించుకుంటున్నారు. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక సందర్భంగా.. ఈ విషయాన్ని ప్రముఖమైన అంశంగా మార్చడంలో ఆయన సక్సెస్ అయ్యారు. సాధారణంగా స్పీకర్ ఎన్నిక తర్వాత.. ఆయనను అభినందిస్తూ.. సభ్యులు మాట్లాడతారు. ముందుగా సభా నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మాట్లాడారు. ఆ సమయంలో.. స్పీకర్ తమ్మినేని సీతారంను అభినందించడం కన్నా.. సభా విలువల పేరుతో గత సభలో జరిగిన విషయాలను.. ఎమ్మెల్యేల ఫిరాయింపు, వారికి మంత్రి పదవులు ఇచ్చిన వైనాన్ని గుర్తుకు తెచ్చారు. తాను ఉన్నతమైన విలువల్ని నెలకొల్పుతానని ప్రకటించారు. ఆ సమయంలో… స్పందించిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు… వైఎస్ జగన్ తండ్రి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా..పార్టీ మారారని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి.. తనదైన దూకుడుతో.. చరిత్రలు చెప్పవద్దని…గత సభలో తమపై దాష్టీకాన్ని చూపించారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇస్తున్న సమయంలో.. చంద్రబాబు.. అనిజీగా కనిపించారు. ఫేస్‌లో ఎక్స్ప్రెషన్స్ ను బయటకు కనిపించనివ్వలేదు.
స్పీకర్ ఎన్నిక విషయంలో.. టీడీపీ సంప్రదాయాలు పాటించలేదన్న రీతిలో కార్నర్ చేయడానికి వైసీపీ ప్రయత్నించింది. స్పీకర్ ను.. చెయిర్ వద్దకు తీసుకెళ్లడానికి చంద్రబాబు వెళ్లలేదు. అచ్చెన్నాయుడు వెళ్లారు. తమకు ఆహ్వానం లేదని.. చంద్రబాబు చెప్పారు. అయినా గౌరవంతో అచ్చెన్నను పంపామన్నారు. కానీ వైసీపీ దీనిని ఇష్యూ చేసింది.
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఈ అంశాన్ని లేవనెత్తారు. దీంతో చంద్రబాబు స్పందించాల్సివచ్చింది. సభాపతిగా తమ్మినేని పేరు ప్రకటించగానే…కనీసం ఒక్కమాట అయినా చెబుతారని ఆశించానన్నారు చంద్రబాబు. ప్రతిపక్షనాయుకుడిని రమ్మని పిలిస్తే బాగుండేదని…మాకు చెప్పి ఉంటే మేం కూడా వచ్చేవాళ్లమన్నారు బాబు. అధికారపక్షం సంప్రదాయాన్ని పాటించలేదన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. దీనిపై.. టీడీపీని వైసీపీ సభ్యులంతా కార్నర్ చేశారు. తమ్మినేని బలహీనవర్గాలకు చెందిన నేత కాబట్టే.. చంద్రబాబు రాలేదన్నారు.
అయితే… వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కంట్రోల్ తప్పి.. చంద్రబాబు.. రాలేదు..తన బంట్రోతు అచ్చెన్నాయుడును పంపాడని అనడంతో.. సభ వివాదం కీలక మలుపు తిరిగింది. బలహీనవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను అవమానిస్తారా.. అని చంద్రబాబు మండిపడ్డారు. దీనిపై అచ్చెన్నాయుడు కూడా.. స్పీకర్ రూలింగ్ ఇవ్వాలని కోరారు. అయితే క్షమాపణ చెప్పేందుకు.. చెవిరెడ్డి నిరాకరించారు. వివాదం పెద్దది కాకుండా ఉండేందుకు అచ్చెన్నాయుడును ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిర్ణయం తీసుకోవాలని…ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పీకర్‌ను కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్ ..రికార్డులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. చెవిరెడ్డి ప్రసంగంలో అభ్యంతరకర పదాలు ఉంటే తొలగిస్తామని…ఈ సెషన్ పూర్తయ్యేలోపే సభకు తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని తమ్మినేని సీతారాం చెప్పారు. మొత్తానికి…సీనియార్టీపై యువరక్తమే పైచేయి సాధించినట్లయింది.