ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏర్పరచుకున్న మొదటి మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేశామని జగన్ సహా వైఎస్ఆర్ సీపీ ముఖ్య నేతలు అందరూ చెబుతూ వస్తున్నారు. ప్రత్యేకించి బీసీలకు న్యాయం చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ నుండి ప్రకటనలు కూడా వెలువడు తున్నాయి. అయితే ఈ ప్రకటన పై ప్రజల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ఒకవైపు ప్రజలకు చూపించేందుకు బీసీలను మంత్రి పదవుల్లో తీసుకున్నప్పటికీ, నామినేటెడ్ పదవుల్లో ఇప్పటికే ఉన్న బీసీలను తొలగించి ఆ పదవులను రెడ్డి వర్గానికి ఇస్తున్నారని కొందరు అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
– టిటిడి చైర్మన్ గా ఇప్పటివరకు ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ బీసీ అయితే, ఇప్పుడు సుధాకర్ యాదవ్ స్థానంలో ఆ పదవిని వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు.
– తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్ గా ఇప్పటివరకు బిసి వర్గానికి చెందిన నరసింహ యాదవ్ ఉంటే, ఇప్పుడు ఆ పదవి నుంచి ఆయనను తప్పించి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి తుడా చైర్మన్ పదవిని అప్పగించారు.
– ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) చైర్మన్ పదవి లో ఇప్పటివరకు కృష్ణయ్య అనే బిసి ఉంటే, ఆ పదవి నుండి ఆయనను తప్పించి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రోజా ను చైర్మన్గా నియమించారు.
మొత్తానికి చూస్తే, మంత్రివర్గ కూర్పు సమయంలో బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామని చెప్పుకుంటున్నప్పటికీ, నామినేటెడ్ పదవుల్లో ఇప్పటి వరకే ఉన్న బీసీలను పీకేసి ఆ స్థానాలను రెడ్ల కి కట్టడంపై అటు బీసీల లోను, ఇటు సామాన్య ప్రజల లోనూ, విమర్శలు వస్తున్నాయి.