టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ తప్పించే ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే! స్విమ్స్ లో అక్రమాలు జరగాయనీ, కొన్ని నియామాలకు సంబంధించి అధికారులపై పుట్టా సుధాకర్ ఒత్తిడి తీసుకొచ్చే ఆరోపణలు తాజాగా తెరమీదికి వచ్చాయి. ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్థావిస్తూ ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి టీటీడీ నుంచి చేరింది. దాని ఆధారంగా పుట్టాను ప్రభుత్వం వివరణ కోరుతోంది. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై సుధాకర్ తాజాగా ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడారు.
ప్రభుత్వం మారిన తరువాత టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి దిగిపోమంటూ అధికార పార్టీ కోరుకుంటోందన్నారు పుట్టా. తనను పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వాటిని అనుసరిస్తానన్నారు. అయితే, పదవి నుంచి తప్పించడం కోసం లేనిపోని ఆరోపణలు చేస్తే తాను ఒప్పుకునేది లేదని పుట్టా అన్నారు. అదే పరిస్థితి వస్తే.. తాను ఎంతవరకైనా వెళ్తానన్నారు. అధికారులకు పాలక మండలి అంటే గౌరవం లేదని విమర్శించారు. తాను ప్రధానంగా రెండు డిమాండ్లు చేస్తున్నాననీ… నాణాలు ఎలా బయటకి వచ్చాయనేది నిగ్గు తేల్చి, అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రెండోది.. ఇప్పుడు స్విమ్స్ వ్యవహారంపై కూడా జుడిషియల్ ఎంక్వయిరీ వేయాలన్నారు. డైరెక్టర్ రవి కుమార్ పై కూడా విచారణ జరగాలనీ, ఆయన బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచీ ఇప్పటివరకూ పనితీరుని కూడా సమీక్షించాలన్నారు. ఆయన పదవిలోకి వచ్చిన దగ్గర్నుంచీ కొన్ని అవినీతి పనులు చేశారనీ, వాటిపై కూడా చర్యలుండాలన్నారు.
తనపై ఆరోపణల్ని అంత సులువుగా తీసుకోననీ, వీటితో భయపెడితే పదవి వదిలేసి వెళ్లిపోనని పుట్టా అంటున్నారు! ఇంకోపక్క.. ఆయన ఇచ్చే వివరణ సరిగా లేకపోతే వెంటనే తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే రాజీనామా చేస్తా అంటున్నారు! ప్రభుత్వం నుంచైతే సంకేతాలు క్లియర్ గానే ఉన్నాయి. న్యాయపరంగా ఎలాంటి వివాదాలకూ ఆస్కారం ఇవ్వకూడదనే ధోరణిలో ప్రభుత్వం వ్యూహం! మొత్తానికి, ఈ అంశం రోజురోజుకీ బిగుసుకుంటున్నట్టుగానే కనిపిస్తోంది. పుట్టా తొలగింపు ప్రక్రియపై ఇప్పటికే ప్రజల్లో కొంత ఆసక్తి నెలకొంది. ఉద్దేశపూర్వంగానే ఆయన విషయంలో ప్రభుత్వం అత్సుత్సాహం ప్రదర్శిస్తోందా అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.