కొన్ని ప్రచారాలు ఊరికే జరగవు! వెనక ఏదో మతలబు ఉండే ఉంటుంది! కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై గడచిన రెండ్రోజులుగా వస్తున్న కథనాలూ అలానే కనిపిస్తున్నాయి. ఆయన భాజపాలో చేరతారని కొన్ని ఛానెల్స్ కథనాలు మొదలుపెట్టాయి. కోమటిరెడ్డి, రేవంత్ లతో రామ్ మాధవ్ భేటీ అయ్యారంటూ సాక్షి ఛానెల్ చెప్పింది..! నిజానికి, రేవంత్ రెడ్డి కేంద్రంగా ఇప్పుడు మరోసారి ఎందుకీ ప్రచారం కొన్ని ప్రధాన మీడియాలతోపాటు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది..? ఆయన పార్టీ మారతారా అంటూ సోషల్ మీడియాలో ఆ మధ్య గుప్పుమన్న పుకార్లపై రేవంత్ వివరణ కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా దాదాపు అలాంటి పరిస్థితి. ఇంతకీ, రేవంత్ పార్టీ మారతారన్న ప్రచారాన్ని తెర మీదికి తేవడం ద్వారా రాజకీయంగా ఎవరికైనా ఏమైనా ఉపయోగాలున్నాయా.. అంటే, ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడినా ఎంపీగా గెలిచారు కాబట్టి, భవిష్యత్తులో తెరాసకు ధీటుగా మాట్లాడే వాయిస్ కచ్చితంగా ఆయనదే కాబోతోంది. అంటే, కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రముఖ పాత్ర పోషించబోతున్నారని అనుకోవచ్చు. నిజానికి, కాంగ్రెస్ లో చేరాక రేవంత్ కి కీలక పదవి ఏదో ఒకటి ఇస్తారనే ప్రచారం ఎన్నికల ముందు నుంచీ ఉంది, కానీ పార్టీపరంగా ఇంతవరకూ అలాంటిదేదీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వాల్సిన సమయమూ, ఇచ్చే అవకాశమూ, అవసరం కూడా ఒకేసారి వచ్చాయని చెప్పొచ్చు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకున్నారు. కాబట్టి, రేవంత్ కి పార్టీ పగ్గాలు ఇవ్వాలని హైకమాండ్ కి ఉందనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమౌతోంది. రేవంత్ కి ఆ బాధ్యతలు కట్టబెడితే… మంచి మాస్ లీడర్ గా గుర్తింపు ఉంది కాబట్టి, పార్టీ కేడర్ కు కొత్త జోష్ పక్కాగా వస్తుందన్నది అధిష్టానం అంచనా.
ఆ పరిస్థితిని రానీయకుండా చేసేందుకు కొంతమంది రేవంత్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగమే తాజాగా తెర మీదికి వస్తున్న పార్టీ మార్పుల కథనాలు అని అనుచరులు అంటున్నారు! హైకమాండ్ దగ్గర రేవంత్ మీద నమ్మకం పోవాలంటే ఏం చెయ్యాలీ… ఆయన పార్టీలో ఉంటారో ఉండరో అనే అభిప్రాయన్ని కలిగించాలి. లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తరువాత హైకమాండ్ పరిస్థితి కూడా బాలేదు. నేతల్ని గుంజుకునే రాజకీయాలు భాజపాకి కొత్తేమీ కాదు. కాబట్టి, ఇలాంటిప్పుడే కొన్ని అనుమానాలు రేకెత్తిస్తే… ఆయనకు ఇద్దామనుకుంటున్న కీలక బాధ్యతలపై పునరాలోచనల్లో పడేలా చేయడం కోసమే కొంతమంది ప్రయత్నిస్తున్నారట! మరి, ఆ కొంతమంది… సొంతమందిలో కొంతమందా… ? ఏమో, కాంగ్రెసులందు తెలంగాణ కాంగ్రెసు వేరు కదా!