పార్లమెంటరీ పార్టీ పదవుల్లో అనుభవానికే అవకాశం కల్పించారు కేసీఆర్. టీఆర్ఎస్ వాణిని ఢిల్లీలో బలంగా వినిపించే అనుభవం.. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణకు అనుకూలంగా లాబియింగ్ చేయగల నేతలకే పదవులు కట్టబెట్టారు. గతంలో టీడీపీ తరపున లోక్ సభా పక్ష నేతగా పనిచేసిన నామా నాగేశ్వర్ రావుకే కేసీఆర్ అవకాశం ఇచ్చారు. పార్టీలో అంతా జూనియర్లు కావడం…రెండోసారి గెలిచిన ఎంపీలు నలుగురికి వాయిస్ లేకపోవడం.. నామాకు కలసి వచ్చింది. సామాజిక సమీకరణాలు, అనుభవం, విధేయతను దృష్టిలో ఉంచుకొని కె.కేశవరావును పార్లమెంటరీ పక్ష నేతగా కొనసాగించారు. అటు రాజ్యసభ పక్ష నేతగా కేకే నే కొనసాగుతారు. గత లోక్ సభలో పార్టీ లోక్‌సభాపక్ష నేతగా జితేందర్ రెడ్డి, ఉప నేతగా వినోద్ కుమార్ వ్యవహరించారు. ఒకరికి కేసీఆర్ టిక్కెట్ ఇవ్వలేదు. మరొకరు ఓడిపోయారు.
రెండు సభల్లోను టీఆర్ఎస్ వాణి గట్టి గా వినిపించి కేంద్రంలో ఎలా వ్యవహరించాలనే దానిపై కేసీఆర్ ఎంపీలందరికి దిశానిర్దేశం చేశారు. గత లోక్ సభలో వివిధ అంశాలవారీగా కేంద్రానికి మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ ఈసారి ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాలకు రెగ్యూలర్ గా వెళ్లాలని…చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని కొత్త ఎంపీలకు సూచించారు. కేంద్రానికి ఇప్పుడు టీఆర్ఎస్ అవసరం ఎంత మాత్రం లేనందున… తెలంగాణ ప్రయోజనాల విషయంలో నిలదీసేందుకు… వెనుకడుగు వేయవద్దన్నారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనలో ఎంపీలు గట్టిగా తమ వాణిని వినిపించాలని ఎంపీలకు సూచించారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా… మిషన్ కాకతీయ, భగీరథకు కేంద్ర సహాయం, బయ్యారం ఉక్కు పరిశ్రమతో పాటు మిగత రాష్ట్ర విభజన హక్కుల సాధనకోసం కేంద్ర పైపోరాడి సాధించుకోవాలని పార్టీ ఎంపీలకు కేసీఆర్ సూచించారు.
నిజానికి… గత సభలో… కూడా… కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ… టీఆర్ఎస్తో.. బీజేపీ సన్నిహితంగా వ్యవహరించింది. దీనికి కారణం.. రాజ్యసభలో.. మెజార్టీ లేకపోవడం. వివిధ సందర్బాల్లో.. టీఆర్ఎస్.. బీజేపీకి అండగా నిలిచింది. అయితే.. ఈ సారి రాజ్యసభలోనూ.. బీజేపీ మెజార్టీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ లాంటి పార్టీల అవసరం ఉండదు. పైగా తాము తెలంగాణలో ఎదగాలనుకుంటున్నారు. అందుకే.. టీఆర్ఎస్తో సన్నిహిత సంబంధాలను నెరపేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా లేరు. అందుకే తప్పనిసరి పోరాటానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు.