అవినీతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంటల కొద్దీ లెక్చర్లు ఇస్తోంది. కానీ నీతులు ఉన్నది చెప్పడానికేనన్నట్లుగా.. ఆ పార్టీ నేతలు.. బహిరంగంగానే వ్యవహరిస్తున్నారు. చోటా మోటా నేతలైతే… వాళ్లకు.. అగ్రనేతల అవినీతి వ్యతిరేక విధానం గురించి అవగాహన లేదనుకుందాం .. కానీ అగ్రనేతలే.. ఇలాంటి వ్యవహారాల్లో అనుమానాస్పదంగా మాట్లాడుతూండటంతో.. అనుమానించాల్సి వస్తోంది. నేరుగా అవినీతి చేద్దామని చెబుతూ… కార్యకర్తలకు భరోసా ఇస్తూండటంతో… ఏదో తేడా కొడుతోంది.
వైసీపీ కార్యకర్తలనే గ్రామవాలంటీర్లుగా నియమిస్తారట..!
వైసీపీ ప్రభుత్వం పథకాలను డోర్ డెలివరీ చేయాలనుకుంటోంది. అందు కోసం ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమిస్తోంది. దానికి రూ. 5వేలు పారితోషికం కూడా నియమించారు. ప్రభుత్వం తరపున ఇవి అధికారిక నియామకాలు. ప్రజల సొమ్మే.. జీతాలుగా చెల్లిస్తారు. అందుకే.. అధికారికంగా… ఎంపిక కోసం. ఓ నోటిఫికేషన్ ఇచ్చారు. దాని ప్రకారం విద్యార్హతలు కూడా పేర్కొన్నారు. కానీ.. ఈ పోస్టులన్నీ.. వైసీపీ కార్యకర్తలకే ఇస్తామని.. విజయసాయిరెడ్డి నేరుగా చెబుతున్నారు. కార్యకర్తలతోపాటు అందరూ దరఖాస్తు చేసుకుంటారని, మీకు ఏ విధంగా న్యాయం చేయాలో అధిష్టానం చూసుకుంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు పొందేందుకు పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.
అర్హులను కాదని.. కార్యకర్తలకు ఎలా ఉద్యోగాలిస్తారు..!?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ కన్వీనర్లు, రాష్ట్రస్థాయి కో-ఆర్డినేటర్లు, క్రియాశీలక నేతల సమావేశంలో .. విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు.. కలకలం రేపాయి. అసలు నిబంధనల ప్రకారం చేపట్టాల్సిన నియామకాల్లో.. వైసీపీ కార్యకర్తలనే నియమిస్తామని.. దరఖాస్తు చేసుకోమని..నేరుగా చెప్పడం.. అంటేనే ఎంత తెగించారో అర్థం అయిపోతుంది. నిబంధనలకు విరుద్ధంగా.. తమ వారిని.. తమ పార్టీ కార్యకర్తలను ఆయా పోస్టుల్లో నియమించేందుకు.. అక్రమాలకు పాల్పడబోతున్నామని.. విజయసాయిరెడ్డి… నేరుగా చెప్పేశారు. అంటే.. అది అవినీతే. మరి అవినీతి లేకుండా చేస్తామన్న ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు..?
గ్రామ వాలంటీర్లనూ అవినీతికి పాల్పడమని ప్రొత్సహించడం కాదా..?
అక్రమంగా ఉద్యోగం పొందిన వారు… నిఖార్సైన వాలంటీర్‌గా పని చేస్తారని ఎలా భావిస్తారు. పార్టీ కోసం.. కష్టపడ్డాం.. మాకు సంపాదించుకునే అవకాశం లేదా.. అని ప్రతి ఒక్క కార్యకర్త అనుకుంటే… ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తారు కదా..! పైగా.. వాలంటీర్లకు ఇచ్చే రూ. 5 వేల రూపాయలు తక్కువగా భావించొద్దని విజయసాయిరెడ్డి సూచిస్తున్నారు. ఆ చెప్పడం కూడా.. ఇతర సంపాదన ఏదో ఉంటుందన్న ఉద్దేశంలో …సలహా ఇస్తున్నట్లుగా ఉంది. పైగా.. 2024లో జరిగే ఎన్నికలే లక్ష్యంగా అందరూ పనిచేయాలని విజయసాయిరెడ్డి అందరికీ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సొమ్ముతో… ప్రజల సొమ్ముతో పార్టీ కార్యకర్తలను.. వాలంటీర్లుగా నియమించుకుని .. వారి ద్వారా.. ప్రతి యాభై ఇళ్లకు ఓ వైసీపీ కార్యకర్తను.. పెట్టుకుని.. ఎన్నికల రాజకీయాలను చేద్దామనుకుంటున్నారా..? ఇదంతా అవినీతి కాదా..?