రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లి మండలంలోని ఒక పాఠశాలలో కొంతమంది విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు సీఎం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… రాష్ట్రంలోని పిల్లలందరినీ బడికి పంపించాలని తల్లిదండ్రులను కోరారు. విద్యార్థులు భవిష్యత్తులో డాక్టర్లుగా ఇంజినీర్లుగా కలెక్టర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. తాను సుదీర్ఘంగా చేసిన పాదయాత్రలో పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాలని చూశాననీ, ఆ సందర్భంగా వారికి మాట ఇచ్చాననీ, ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటున్నా అన్నారు జగన్. అమ్మ ఒడి పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు.
జనవరి 26 నాడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద పండుగ మాదిరిగా చేస్తామని సీఎం జగన్ అన్నారు. ఆ రోజున, బిడ్డను బడికి పంపించే ప్రతీ తల్లి చేతిలో రూ. 15000 పెడతానన్నారు. పిల్లల చదువు కోసం ఏ ఒక్కరూ ఇబ్బందిపడకూడదన్న లక్ష్యంతోనే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు కోనివారి సంఖ్య 23 శాతం ఉంటే, మన రాష్ట్రంలో 33 శాతం మంది ఉన్నారన్నారు. ఈ పరిస్థితికి కారణం పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు లేకపోవడమే అన్నారు. గత పాలనలో ప్రభుత్వ పాఠశాలలను నిరుత్సాహపరిచి, ప్రైవేటు విద్యా సంస్థల్ని ప్రోత్సాహించారని విమర్శించారు. తనకు రెండేళ్ల సమయం కావాలనీ, ఈలోగా పాఠశాలల రూపు రేఖల్ని మార్చి చూపిస్తానని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతీ బడిలో ఇంగ్లిష్ మీడియం తప్పనిసరిగా ఉంటుందనీ, దాంతోపాటు తెలుగు నేర్పించాలని సీఎం అన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో అమ్మ ఒడి ముఖ్యమైంది. అందుకే, ముందుగా కీలక హామీల అమలుపై సీఎం దృష్టిపెడుతున్నారు. అయితే, ఈ అమ్మ ఒడి పథకం… ఏ బడికి వెళ్లిన పిల్లలకైనా ఇస్తామని సీఎం అంటున్నారు. దీని అమలుపై మరింత విశ్లేషణను ప్రభుత్వం చేయాలంటూ కొన్ని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఈ పథకం అమలు చేస్తామని అంటున్నారు. నిజానికి, ఎగువ మధ్య తరగతి కుటుంబాల వారిలో చాలామందికి తెల్ల కార్డులున్న పరిస్థితి. ఈ పథకం ద్వారా నిజమైన లబ్ధిదారులు పేదవాళ్లే ఉండాలి. కాబట్టి, ముందుగా ఈ చెకింగ్ జరగాలనేది కొంతమంది అభిప్రాయం. అయితే, వచ్చే ఏడాది జనవరికి చెక్కులు ఇస్తామంటున్నారు. ఈలోపు దీనికి సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వం విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది కదా.