తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం .. కొత్త తరహా రాజకీయాలకు సరిపోదని నిర్ణయించుకున్నారా..? . మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తను కూడా.. ఓ స్ట్రాటజిస్ట్ ను నియమించాలని అనుకుంటున్నారా..?. వాళ్లు వీళ్లు ఎందుకు.. నేరుగా ప్రశాంత్ కిషోర్‌నే నియమించుకుంటే సరిపోతుందనే అంచనాకు వచ్చారా..? ఈ మేరకు ఐప్యాక్ టీమ్‌కు… కాంట్రాక్ట్ ప్రపోజల్ వెళ్లిందా..?.అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ టీంకు.. ఐదేళ్ల పాటు కాంట్రాక్ట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఆఫర్ వెళ్లిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు జాతీయ మీడియా కూడా కథనాలు ప్రసారం చేసింది. ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహాలు దారుణంగా ఫెయిలయ్యాయి. తాను అనేక రకాల అంచనాలు.. విశ్లేషణలు వేసుకుని… వ్యూహాలు సిద్దం చేసుకున్నప్పటికీ.. ఘోర పరాజయం ఎదురయంది. తన లెక్క ఎక్కడ తప్పిందో.. చంద్రబాబుకే అర్థం కావడం లేదు. అందుకే… రాజకీయ వ్యూహకర్త వైపు.. చంద్రబాబు మొగ్గుతున్నట్లుగా తెలుస్తోంది.
రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ వెనక్కొచ్చేసిన పీకే..!
నిజానికి ప్రశాంత్ కిషోర్… తన ఐ ప్యాక్ టీంను.. స్నేహితులకు అప్పగించి… తాను రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ యూ పార్టీలో చేరారు. చేరిన వెంటనే.. నితీష్ కుమార్.. పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. తన వారసునిగా కూడా ప్రకటింటారు. అయితే.. జేడీయూ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ పెద్దగా ఇమిడినట్లుగా లేరు. అందుకే.. మళ్లీ తన వ్యూహకర్త పనుల్లో బిజీ అవుతున్నారు. ఎన్నికలకు ముందు.. వైసీపీ కోసం.. పూర్తి స్థాయిలో పని చేశారు. ఇప్పుడు… బెంగాల్లో మమతా బెనర్జీ కోసం.. పని చేసేందుకు ఆయనకు చెందిన ఐ ప్యాక్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో.. ఆయన మళ్లీ.. రాజకీయాల కన్నా..వ్యూహకర్త పనులపై ఫిక్సయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
పీకేను వ్యక్తిగతంగా విమర్శించిన టీడీపీ అధినేత..!
ప్రశాంత్ కిషోర్ .. వైసీపీ కోసం పని చేస్తున్నప్పుడు… టీడీపీ నేతలు ఎగతాళి చేశారు. బీహార్ వ్యక్తికి.. ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. పూర్తిగా… పార్టీలోకి చేతుల్లోకి తీసుకుని… వ్యూహాలు ఖరారు చేశారని.. ఆరోపించారు. అంతే కాదు.. ఫామ్-7తో లక్షలాది ఓట్లను తొలగించే కుట్ర వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే.. బీహార్ డెకాయిట్ గా.. పీకేను పోల్చారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ విమర్శలు కూడా చేశారు. అయితే..ఎన్నికలు ముగిసిన తర్వాతే ప్రశాంత్ కిషోర్ పోల్ మేనేజ్ మెంట్, వ్యూహాలు టీడీపీ అధినేతకు అర్థం అయినట్లుగా తెలుస్తోంది. టీడీపీకి అండగా ఉండే సామాజికవర్గంపై.. ఇతర కులాలన్నింటినీ రెచ్చగొట్టడంతో.. వైసీపీకి పకడ్బందీ వ్యూహరనచ చేశారన్న అభిప్రాయం.. టీడీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఎలాంటి సందర్భాలు లేకపోయినా పోలీసు అధికారులంతా ఒకే వర్గం వారన్నట్లుగా ప్రారంభించి… టీడీపీ అంటే.. వాళ్లే అన్నట్లుగా ప్రజల్లోకి తీసుకెళ్లి అందర్నీ వ్యతిరేకం చేయడంలో సక్సెస్ అయ్యారన్న భావన మాత్రం అంతర్గంగా వచ్చింది. దీనికి విరుగుడుగా ప్రశాంత్ కిషోర్‌తోనే వ్యూహాలు ఖరారు చేయించుకోవాలనే ఆలోచన టీడీపీ అధినేతకు వచ్చినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ఆఫర్ ను పీకే అంగీకరిస్తారా..?
అయితే.. ఇదంతా.. జాతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. అదీ కూడా.. టీడీపీ కాంట్రాక్ట్ ప్రపోజల్ మాత్రమే పెట్టిందని మాత్రమే. దానికి పీకే టీంఅంగీకరించని ఎక్కడా కన్ఫర్మ్ చేయడం లేదు. చంద్రబాబు … వ్యక్తిగతంగా పీకేని విమర్శించారు. అలాగే.. పీకే టీం.. పని చేయడానికి అంగీకరించాలి. ఇప్పుడు.. మమతా బెనర్జీకి పని చేయడానికి సిద్దపడుతున్నారు కాబట్టి… టీడీపీ ప్రపోజల్ కి అంగీకరిస్తారో లేదో చెప్పలేమంటున్నారు. అదే సమయంలో.. చంద్రబాబు తన పార్టీలో తను చెప్పిన వ్యూహాలనే అమలు చేయాలనుకుంటారు. వేరే వారి డైరక్షన్ లో పని చేయడం దాదాపు అసాధ్యం. మరి ఇదంతా వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి మరి..!