తెలుగు360 రేటింగ్: 3/5
కొత్తదనానికి ఆహ్వానం పలకడం అన్నది అవసరమే. కానీ విషయం మాత్రం ‘రాముని తోక పివరిండు ఇట్లనియే’ అన్నట్లు వుండకూడదు. మొత్తం కొత్తదనాన్ని ఒక్క సినిమాలోనే కుక్కేసి వదిలేయకూడదు. ప్రేక్షకుడికి కొంచెం కొంచెంగా జీర్ణించుకునే అవకాశం ఇవ్వాలి. ఈవారం విడుదలయిన గేమ్ ఓవర్ సినిమా ఒకింత కాదు, ఎక్కువ కొత్త ప్రయత్నమే. సాధారణంగా మనకు ఇటీవల హర్రర్ సినిమాలు అంటే నేల, బెంచ్ క్లాస్ కోసమే అన్నట్లు తీస్తూ వస్తున్నారు. అలా కాకుండా, కాస్త బుర్ర పెట్టాలి, సినిమా తొలి రీలు నుంచి చివరి రీలు వరకు తల స్క్రీన్ వైపే వుంచి ప్రతి చిన్న విషయం గమనించాలి అనే టైపు అన్నమాట. పైగా సినిమా అంటే కంప్యూటర్ గేమ్, దాన్ని ఇలా సాల్వ్ చేయాలి అనే హింట్ లు దర్శకుడు ఇస్తూ వెళ్లాడు. వాటి అనుగుణంగా సినిమా ముందుకు సాగింది, ఇలాంటి మాటలు చెప్పుకోవడం వరకు బాగానే వుంటుంది. కానీ సినిమా చూస్తుంటేనే, ఇదెక్కడి సినిమా అనిపిస్తుంది.
గేమ్ ఓవర్ సినిమా కథ ఏమీ కొత్తది కాదు. గతంలో చాలా హాలీవుడ్, ఇండియన్ సినిమాలు వచ్చాయి. ఇంట్లో ఒంటరిగా వున్న అమ్మాయి, దుండగుడు దాడి చేస్తే, తెలివిగా ఎలా ఎదుర్కొండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదీ కాన్సెప్ట్. అయితే దర్శకుడు దీనికి చాలా అద్దకాలు అద్దాడు. అమ్మాయికి అప్పటికే చిన్న డిప్రెషన్, గతంలో జరిగిన సంఘటనతో చీకటి అంటే భయం,
దానికి తోడు మరో అమ్మాయి కథ. క్యాన్సర్ ను మూడు సార్లు గెలిచిన్న అమ్మాయి ఆత్మ, ఈ అమ్మాయిని మోటి వేట్ చేయడం. ఎలాగూ చనిపోతాం అని తెలిసినపుడు పోరాడి చనిపోవాలనే సందేశం. ఇలాంటివి అన్నీ ‘హోమ్ ఎలోన్’ లాంటి కథకు జోడించి, నావెల్ ట్రీట్ మెంట్ తోడుగా హర్రర్ థ్రిల్లర్ చేసాడు.
స్వప్న (తాప్సీ) జీవితంలో ఓ చేదు సంఘటన వుంటుంది. (అదేంటో ప్రేక్షకులకు సినిమా నుంచి బయటకు వచ్చాక కూడా తెలియదు. ఎందుకంటే దర్శకుడు చెప్పలేదు. చూపించ లేదు). ఆమె చేతికి టట్టూ వేయించుకుంటుంది. కానీ అనుకోకుండా ఆ టట్టూ ఇంక్ లో మరణించిన మరో అమ్మాయి అస్తికల పొడి కలుస్తుంది. దాంతో ఆ టట్టూ స్వప్నను కాస్త ఇబ్బంది పెడుతూ వుంటుంది. కానీ అది ఇబ్బంది కాదు, మోటివేషన్ అని తెలుస్తుంది. అలాంటి టైమ్ లో ఆ మరణించిన అమ్మాయిని హత్య చేసిన ముగ్గురు సైకోలు, స్వప్న ఇంటి మీదకు కూడా వస్తారు. అప్పుడు స్వప్న ఏ విధంగా ఎదుర్కొంది అన్నది కథ.
దర్శకుడు అసలు కథను, మోటివేషన్ పాయింట్ ను మొత్తంగా ద్వితీయార్థానికే దాచుకున్నాడు. ప్రథమార్థం మొత్తం హీరోయన్ ఫోబియా, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ కు, ద్వితీయార్థంలో జరగబోయే దాన్ని పరోక్షంగా సూచిస్తూ వుండడానికి వాడుకున్నాడు. అదే సమయంలో టేకింగ్ ను కొత్తగా చూపించడానికి అవకాశంగా తీసుకున్నాడు. దీంతో కామన్ ప్రేక్షకుడు ‘ ఏంటీ సినిమా?’ అనుకుంటూ కిందా మీదా అవుతాడు.
సినిమా ద్వితీయార్థంలోకి ప్రవేశించాక, ప్రేక్షకుడు కుదుటపడతాడు. ఎందుకు అంటే, అక్కడే అసలు కథ వుంది. పిరికిగా వుండే అమ్మాయి, ఇంటి మీదకు సైకోలు దాడి చేసారని తెలిసిన తరువాత ఏవిధంగా వాళ్లను ఎదుర్కొంది అన్నది వుండేది అక్కడే. అందువల్ల ఆ భాగం అంతా ఉత్కంఠగానే నడుస్తుంది.
ఇక్కడ కూడా దర్శకుడు కాస్త కొత్త పుంతలు తొక్కే ప్రయత్నం చేసాడు. కల..నిజం అన్నవి పడుగు పేకల్లా నడిపాడు. ప్రేక్షకుడు ఏది కల, ఏది నిజం అన్నది అవి పూర్తయిన తరువాత కానీ నిర్థారణకు రాకుండా వుంటుంది వ్యవహారం. కలల్లో ముందుగానే వెల్లడయ్యే విషయాలు చూసుకుని, వాటికి అనుగుణంగా సైకోలను ఎదుర్కొంటుంది హీరోయిన్. కానీ దీనిని మోటివేషన్ అని ఎలా అనుకోవాలో అన్నది మాత్రం సగటు ప్రేక్షకుడి అనుమానం.
అయితే ప్రథమార్థం వృధాగా ఖర్చు పెట్టడం, ద్వితీయార్థంలో పజిలింగ్ టేకింగ్ సంగతి పక్కన పెడితే, దర్శకుడికి కొన్ని విషయాల్లో మాత్రం మంచి మార్కులు పడతాయి. సినిమాను వీలయినంత షార్ప్ గా ఎడిట్ చేయించడం, సీన్లను చాలా పటిష్టంగా, క్లుప్తంగా తీయడం, పాటలు, ఫన్ లాంటి కమర్షియల్ విషయాల జోలికి పోకుండా చూడడం వంటివి దర్శకుడి ఆధునిక ఆలోచనా విదానానికి అద్దం పడతాయి. అదే సమయంలో కెమేరా పనితనం, నేపథ్య సంగీతం వంటి సాంకేతిక సహకారాన్ని బాగా తెచ్చుకున్నారు.
ఇలా కొత్తదనం, సరైన సాంకేతిక సహకారం, సరైన ద్వితీయార్థం మేళవించడం వల్ల దర్శకుడికి, సినిమాకు మార్కులు అయితే పడతాయేమో కానీ, సగటు ఆడియన్స్ కు మాత్రం సినిమా అంత సులువుగా ఎక్కదు. పట్టదు. అదే సమస్య. అయితే గతంలో సినిమా మేకర్లు జనానికి కావాల్సిందే అందించడం చేసేవారు. కానీ ఇప్పుడిప్పుడే మేకర్లు తాము అనుకున్నది జనానికి పట్టేలా చేద్దామనే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో గేమ్ ఓవర్ ఒకటి.
ఫినిషింగ్ టచ్..న్యూ గేమ్
తెలుగు360 రేటింగ్: 3/5