భారతీయ జనతా పార్టీని బ్లాక్‌మెయిల్ చేసి.. రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడంలో శివసేన పార్టీ పక్కాగా వ్యవహరిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు.. బీజేపీతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చిన శివసేన…ఎప్పుడూ జగడమే పెట్టుకుంది. అయితే.. శివసేనతో పొత్తు లేకపోతే.. మొదటికే మోసం వస్తుందనుకున్న అమిత్ షా.. అడిగినన్ని సీట్లు ఇచ్చి సంతృప్తి పరిచారు. కలిసి పోటీ చేశారు. అయితే ఇప్పుడు.. మరో గొంతెమ్మ కోరికతో శివసేన రెడీ అయిపోయింది. అందుకే కొన్ని రోజులుగా.. మళ్లీ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. ఆ కోరికే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం.
బాల్ థాకరే శివసేన చీఫ్ గా ఉన్నప్పటి నుంచి బీజేపీతో పొత్తు కొనసాగుతోంది. అయితే.. అప్పట్లో.. శివసేన మేజర్ పార్టనల్. అసెంబ్లీ, లోక్‌సభ సీట్లలో.. బీజేపీ కన్నా ఎక్కువ సీట్లలోపోటీ చేసేది. కానీ రాను రాను బీజేపీ ప్రాబల్యం పెంచుకుంది. కానీ ఇప్పుడు శివసేన మళ్లీ తనదైన రాజకీయాలతో మేజర్ పార్టనర్‌గా అవతరించేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే అసెంబ్లీ సీట్ల పంపకాన్ని కూడా గతంలోనే పూర్తి చేసింది. బీజేపీతో సమానంగా… పోటీ చేయబోతోంది. గెలుపొందే వాటిలో తమవే అత్యధికం ఉంటాయని.. తామే మేజర్ పార్టనర్ అవుతామని.. శివసేన నమ్మకంతో ఉంది. అందుకే.. ముఖ్యమంత్రి పీఠం కోసం.. ఇప్పటి నుంచే ఒత్తిడి ప్రారంరభించింది.
ఐదు దశాబ్దాల శివసేన చరిత్రలో ఇంతవరకు థాకరే కుటుంబం నుంచి ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ పదవులూ ఆశించలేదు. పార్టీ తరపున గెలిచిన వారికే పదవులు దక్కేలా..చక్రం తిప్పారు కానీ పదవులు కోరలేదు. ఇదంతా గతం.. ఇప్పుడు ఆ కుటుంబం.. తొలి సారి.. సీఎం పీఠాన్ని ఆశిస్తోంది. అది కూడా.. ఉద్ధవ్ థాకరే కాదు. ఆయన కుమారుడు.. ఆదిత్య ధాకరే. ఆయన వయసు ఇరవై ఎనిమిదేళ్లు మాత్రమే. ఆదిత్య థాకరే పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యమైనంత ఎక్కువ మంది పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆదిత్య థాకరే సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల్లో తన పోటీపై ఏ నిర్ణయమైనా పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే ప్రకటిస్తారని చెబుతూ.. తనకు రాజకీయాలు బాగానే ఒంటబట్టాయని నిరూపిస్తున్నారు.
ఇప్పటికే శివసేనకు అన్నీ తానై వ్యవహారాలు నడిపే.. ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ఆదిత్య థాకరే ఈసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానున్నారని ప్రకటనలు చేస్తున్నారు. దీనిపై ఉద్ధవ్ థాకరే ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ రౌత్ మాట్లాడే ప్రతీ మాట.. ఉద్దవ్ ధాకరేకు తెలిసే మాట్లాడతారు. థాకరే కుటుంబానికి చెందిన వారు ముఖ్యమంత్రులే అవుతారని ఆయన అంటున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం దగ్గర.. శివసేన – బీజేపీ మధ్య పీఠ ముడి పడే అవకాశం కనిపిస్తోంది.