తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ ని భాజపా మొదలుపెట్టేసింది. ఇతర రాష్ట్రాల్లో మత రాజకీయాలు చేసే భాజపా, తెలంగాణలో కుల రాజకీయాలకు తెర తీస్తోంది. రెడ్డి సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవడం కోసం… ఆ వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలకు వల వేస్తున్న సంగతి తెలిసిందే. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ హైదరాబాద్ లో బస చేసి, పలువురు రెడ్డి నేతలను కలిసినట్టు కథనాలొచ్చాయి. అయితే, ఫోకస్ అంతా రెడ్డి నేతల మీదే ఉన్నా… ఆ కుల ముద్ర తెలంగాణలో పడకూడదన్న వ్యూహంతో ఇతర సామాజిక వర్గాలకు చెందిన కొంతమంది కీలక నేతల్ని కూడా ఆకర్షించే పనిలో భాజపా ఉన్నట్టు సమాచారం. దాన్లో భాగంగానే మాజీ ఎంపీ వినోద్ పేరు ఇప్పుడు వార్తల్లోకి వస్తోంది.
పెద్దపల్లి టిక్కెట్ తనకి దక్కకపోవడంతో తెరాసకు గుడ్ బై చెప్పేశారు మాజీ ఎంపీ వినోద్. అంతేకాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ ది కుటుంబ పాలన అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆ తరువాత, కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ మధ్యనే ఆయన్ని రేవంత్ రెడ్డి కలుసుకున్నారు, కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇంకేముంది, ఆయన కాంగ్రెస్ లోకే చేరతాని దాదాపు అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా ఆయన భాజపావైపు అడుగులు వేస్తున్నారు.రామ్ మాధవ్ తో ఆయన భేటీ జరగడంతో రూటు మార్చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
వివేక్ భాజపాకు ఆకర్షితులవ్వడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. కేంద్రంలో భాజపా అధికారంలోకి ఉంది, వివేక్ కి చాలా వ్యాపారులున్నాయి. కాబట్టి, కేంద్ర రాష్ట్రాల్లో ఎక్కడో ఒక అధికార పార్టీ అండ ఉంటే ఆయనకి మంచిదే కదా! ఇక, భాజపా పాయింటాఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే… వివేక్ కి తెలంగాణలో కాస్త పేరున్న మీడియా సంస్థ ఉంది. అది పార్టీకి ప్లస్ అవుతుంది. ఆర్థికంగా పార్టీకి ఆయన అండగా మారుతారు కదా! పైగా, తెలంగాణలో ఒక కుల ముద్ర భాజపాపై పడకుండా జాగ్రత్తపడాలంటే… ఒక ప్రముఖ దళిత నేతను చేర్చుకోవడం ద్వారా… అందరికీ తలుపులు తెరిచే ఉన్నాయనే సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంటుంది! కాంగ్రెస్ లోకి వెళ్తారనుకునేవారు కూడా… ఇప్పుడు తమవైపే మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు రాజకీయ వర్గాలకూ ఇచ్చినట్టు అవుతుంది.