ప్రత్యేకహోదా విషయంలో అడుగుతాం.. అడుగుతాం.. అని.. ఏపీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అదే పనిగా చెబుతున్నారు. ఢిల్లీకి వెళ్లి ఎవర్ని కలిసినా అడిగామని చెబుతున్నారు. తిరుపతిలో ప్రధానని కలిసినప్పుడు మాత్రం అడగడం మర్చిపోయారు. అదే సమయంలో.. పీపీఏలను సమీక్షించే విషయంలో మాత్రం… ప్రధాని పర్మిషన్ అడగడానికి మర్చిపోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అమిత్ అమిత్ షా కలిశారు. ప్రత్యేకహోదాను అడిగానని ప్రకటించారు. మోడీ మనసు మార్చాలని.. అమిత్ షాకు అడిగినట్లు చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. ఓ కేంద్ర మంత్రి.. ఏపీకి వచ్చి… హోదాలేదు.. గీతా లేదని… ఓ రాష్ట్ర మంత్రి ముందే తేల్చి చెప్పి.. ప్యాకేజీ గురించి పరిశీలించాలని.. సూచించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం లైట్ తీసుకుంది. స్పందించకుండా సైలెంట్ గా ఉండిపోయింది.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తిరుపతి పర్యటనకు వచ్చారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కూడా ఉన్నారు. దగ్గరుండి గోయల్ కు దర్శనం చేయించారు మేకపాటి. ఆ తర్వాత తిరుపతిలో.. పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎవరైనా ప్రత్యేకహోదా వస్తుందని… అలా వస్తే పన్ను రాయితీలు వస్తాయని ఆశలు పెట్టుకుంటారేమోనన్నట్లుగా ముందుగానే.. గోయల్ తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. అంతే కాదు.. ప్రత్యేకహోదాపై కేంద్రం ఎప్పుడో నిర్ణయం ప్రకటించిందని.. అందులో మార్పు ఉండబోదని… తేల్చి చెప్పేశారు. హోదాకు బదులు ప్రకటించిన ప్యాకేజీని తీసుకోవాలనేశారు.
అదే వేదికపై ఉన్న మంత్రి మేకపాటి.. ఆయన మాటలు… వింటుూ ఉండిపోయారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఓ కేంద్రమంత్రి.. అలా అంటూంటే.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన మంత్రిగా.. ప్రత్యేకహోదా సాధిస్తామన్న పార్టీ నేతగా.. స్పందించాల్సిన గౌతం రెడ్డి.. అలా కామ్ గా ఉండిపోవడం.. చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అదే విషయాన్ని మీడియా ప్రశ్నిస్తే.. ప్రత్యేకహోదాపై ప్రశ్నించడానికి అది సరైన సందర్భం కాదనేశారు. హోదాపై పోరాటం అనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందన్నారు. మేకపాటి గౌతంరెడ్డి స్పందన.. తేడాగా అనిపించడంతో.. పారిశ్రామికవేత్తలు సైతం ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
మరో వైపు..హోదా అనేది.. తమ పోరాటంలో ప్రధానమైన అంశం అన్నట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో చెబుతున్నారు. నీతిఆయోగ్ సమావేశంలోనూ అడుగుతానని అంటున్నారు. అడుగుతూ ఉంటే.. అదే వస్తుందన్న పద్దతిని ఫాలో అవుతున్నారు. కానీ ఆ అడగడాన్ని చాలా సార్లు విస్మరిస్తున్నారు.