బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `రాక్షసుడు`. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ `రాక్షసన్`కి ఇది రీమేక్. తమిళంలో ఉన్న సీన్లు చాలా వరకూ కట్ పేస్ట్ చేశారని, తెలుగులో షూటింగ్ చేసింది చాలా తక్కువని వార్తలొచ్చాయి. ఇవి చిత్రబృందం దృష్టికీ వెళ్లాయి. అయితే వాళ్ల వెర్షన్ మరోలా ఉంది. ఈ సినిమాలో ఎత్తేసిన సీన్లు లేవని, ప్రతీ సీన్ రీషూట్ చేశామని చెబుతున్నారు.కథలో కొన్ని మార్పులు చేర్పులూ చేశామని, తమిళ సినిమా నుంచి ఒక్క సన్నివేశం కూడా తీసుకోలేదని క్లారిటీ ఇస్తున్నారు. క్వాలిటీ, కంటెంట్ విషయంలో తమ బృందం ఏమాత్రం రాజీ పడడం లేదని, ఇప్పటికీ షూటింగ్ కొనసాగుతూనే ఉందని, సగానికి సగం సినిమా తమిళం నుంచి ఎత్తేస్తే – సినిమా ఎప్పుడో పూర్తవ్వాల్సిందని చెబుతున్నారు. ఇంకెంత..?? మరో నెలరోజుల్లో సినిమా విడుదల అవుతుంది. సినిమా చూస్తే..రీషూట్ చేసినవేంటో, యధావిధిగా కాపీ పేస్ట్ చేసినవేమిటో అర్థమైపోతాయి. అప్పటి వరకూ ఆగాల్సిందే.