వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగేశారు. ప్రత్యేకహోదా ఇచ్చే వరకూ.. అడుగుతానని ప్రకటించిన జగన్.. తొలి సారి.. ఓ అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రత్యేకహోదాపై గళమెత్తారు. ప్రత్యేకహోదా ఏపీకి హక్కు అని.. అదే షరతుపై రాష్ట్రాన్ని విభజించారనే సంగతిని నీతి ఆయోగ్ సభ్యులందరికీ … గుర్తు చేశారు. విభజన తర్వాత కొత్త రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగిందని.. 59 శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 47 శాతం ఆదాయం పంచారని సభ్యులందరికీ పంచిన ప్రత్యేక నివేదికలో పేర్కొన్నారు. హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడం వల్ల ఆంధ్ర నష్టపోవడమే కాకుండా.. కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయిందన్నారు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తక్కువగా ఉందని.. లోటును పూడ్చేందుకు గత కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందని అయినా నిలబెట్టుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం పనితీరుపైనా.. నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ విమర్శలు గుప్పించారు. అవినీతి, నిబద్ధత లేమి వల్ల నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. పెట్టుబడులు రాకపోవడంతో ఖజానా ఖాళీ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా మాత్రమే ఏపీకి జీవన రేఖ.. అని జగన్ స్పష్టం చేశారు. హోదా వల్ల మాకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పెరుగుతుందని.. దాని వల్లే వివిధ రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వవద్దని… గతంలో ప్రణాళికా సంఘం సిఫార్సు చేసిందని చెప్పినట్లుగా వచ్చిన వార్తలను జగన్ ఖండించారు. ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఎలాంటి సిఫార్సులు చేయలేదని.. 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్‌సేన్ లేఖ రాశారని…జగన్ గుర్తు చేశారు. ఆ లేఖను కూడా.. నీతిఆయోగ్ సభ్యులకు అందించారు. హోదా ఇవ్వాలని 2014 మార్చి 2న.. కేంద్ర ప్లానింగ్ కమిషన్‌కి సిఫార్సు చేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానించిందని .. అప్పటి నుంచి 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పడే వరకు.. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకి లేదన్నారు. అయినప్పటికీ..ఇవ్వలేదన్నారు. 2014 బీజేపీ మేనిఫెస్టోలోనూ ప్రత్యేక హోదా ప్రస్తావన ఉందని జగన్ గుర్తు చేశారు.
నీతి ఆయోగ్ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందుంచారు. రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక హోదా ఆవశ్యకతను ఈ కీలక భేటీలో విన్పించారు. అలాగే, అధికారులందరికీ ఎనిమిది పేజీల లేఖను అందజేశారు. దాంతో పాటు 48 పేజీల నివేదికను కూడా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సభ్యులందరికీ జగన్ అందజేశారు.