కోమటిరెడ్డి సోదరులు బీజేపీలో చేరిక ఖాయమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడల్లా లేచేలా లేదని… అందరూ బీజేపీ వైపే చూస్తున్నారని… మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్లగొండలో ప్రకటించి.. తమ రాజకీయ భవిష్యత్ ఏ మలుపు తిరగబోతోందో చెప్పకనే చెప్పారు. కొద్ది రోజుల నుంచి కోమటిరెడ్డి సోదరులు బీజేపీతో టచ్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వారు రామ్మాధవ్తో రహస్యంగా చర్చలు కూడా జరిపారని.. మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అదంతా నిజమేనని ఇప్పుడు… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలతో తేలిపోయింది. టీఆర్ఎస్ను ఢీకొట్టాలంటే.. మోడీ లాంటి బలమైన నాయకుడు ఉండాలని… కోమటిరెడ్డి చెబుతున్నారు.
కాంగ్రెస్ ఇప్పట్లో లేచేలా లేదని … 2024లోనూ బీజేపీ రావడం ఖాయంగా కనిపిస్తోందని రాజగోపాల్రెడ్డి భవిష్యత్ వెదుక్కున్నారు. తెలంగాణలోనూ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ కనిపిస్తోందన్నారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడినా పట్టించుకునే నాధుడే లేడని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినందున … రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా… టి.పీసీసీ చీఫ్ మాత్రం అలా ఆలోచించలేకపోయారని మండిపడ్డారు. ఉత్తమ్ పై తన ఆగ్రహాన్ని నేరుగానే వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండగా.. మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. నల్లగొండ నుంచి.. అసెంబ్లీకి పోటీ చేసి ఓటిపోయిన ఆయన సోదరుడు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి .. భువనగిరి నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ విజయం సాధించారు. తాను ఖాళీ చేసిన ఎమ్మెల్సీ స్థానం ఉపఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి తన భార్యను నిలబెట్టినా గెలిపించుకోలేకపోయారు.
పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం.. చాలా రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ పడుతున్నారు. తమ సోదరుల్లో ఎవరికైనా ఆ పదవి ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. పీసీసీ చీఫ్ పోస్ట్ ఇస్తే పార్టీలో ఉంటాం.. లేకపోతే.. బీజేపీలోకి వెళ్తామన్నట్లుగా వారు కొద్ది రోజులుగా హైకమాండ్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే.. బీజేపీ నేతలతో.. సంప్రదింపులంటూ… మీడియాకు కూడా.. సమాచారం ఇచ్చి.. ప్రచారం అయ్యేలా చేశారని చెబుతున్నారు. దానికి హైకమాండ్ ఏ మాత్రం తలొగ్గకపోవడంతో… బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కమలం తీర్థం పుచ్చుకోవడం ఖాయమని…తాజా వ్యాఖ్యలతో తేలిపోయింది.