తెలుగుదేశం పార్టీలో కొద్ది రోజులుగా.. విజయవాడ ఎంపీ కేశినేని నాని కలకలం రేపుతున్నారు. సొంత పార్టీపైనే ఆయన పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మొదట గల్లా కుటుంబంపై కన్నెర్ర చేశారు. ఆ కుటుంబానికి రెండు పదవులు ఎందుకని ప్రశ్నించారు. గల్లా అరుణకుమారి పొలిట్ బ్యూరో మెంబర్‌గాఉన్నారు. గల్లా జయదేవ్‌కు పార్లమెంటరీ పార్టీ నేత పదవి ఇచ్చారు. ఈ కోణంలో.. కేశినేని.. విమర్శలు చేశారు. ఆ తర్వాత .. ఆయన దృష్టి.. మాజీ మత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై పడింది. ఓ రోజు హఠాత్తుగా.. దేవినేని ఉమపై.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కొడాలి నానికి మంత్రి పదవి రావడానికి.. దేవినేని ఉమనే కారణమని… అందుకు కొడాలి నాని.. ఆయనకు కృతజ్ఞుడై ఉండాలని.. ఆ పోస్ట్ సారాంశం.
దేవినేని ఉమతో కేశినేని నానికి పార్టీలో వర్గ విబేధాలున్నాయని.. అప్పుడే బయటకు తెలిసింది. కృష్ణా జిల్లా పార్టీ మొత్తాన్ని దేవినేని ఉమ గుప్పిట్లో పెట్టుకున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో.. విజయవాడలో టీడీపీ కార్యాలయం పెట్టాలనుకున్న అధినేత చంద్రబాబు… కేశినేని కార్యాలయాన్ని ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ మధ్యలో అడ్డుపుల్ల వేసిన దేవినేని ఉమ.. గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయాన్ని ఉపయోగించుకునేలా చేశారు. ఇలా ప్రతీ విషయంలోనూ తన మాట నెగ్గకుండా.. దేవినేని ఉమ చేస్తున్నారనే అసంతృప్తి.. కేశినేని నానిలో పెరిగిపోయింది. ఆ అసంతృప్తిని సోషల్ మీడియా పోస్టుల్లో బయటపెట్టారు.
ఉప్పు-నిప్పులా మారిన దేవినేని ఉమ – కేశినేని నాని మధ్య వ్యవహారం నడుస్తోంది. వీరిద్దరూ ఎదురు పడితే.. ఒకే కార్యక్రమంలో పాల్గొంటే..ఎలా ఉంటుందనే ఆసక్తి సహజంగానే అందరికీ వస్తుంది. ఆ సందర్భం… ఆదివారం వచ్చింది. ఆదివారం వీరిద్దరూ… నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పలు గ్రామాల్లో.. కార్యక్రమాల్లో కలిసే పాల్గొన్నారు. ఇద్దరూ … ముచ్చట్లు చెప్పుకున్నారు. వేదికలపై ప్రసంగించారు. కానీ.. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేనట్లే వ్యవహరించారు. అంతకు ముందు ఏమీ జరగలేదన్నట్లే ఉన్నారు. వీరిద్దరూ… ప్రసంగాల్లో ఒకరిపైఒకరు కామెంట్లు చేసుకుంటారేమోనని.. అందరూ అనుకున్నారు. అలాంటిదేమీ లేకపోవడంతో… కేశినేని నాని చల్లబడిపోయారన్న గుసగుసలు వినిపించాయి. ఇప్పటికైతే అంతే కావొచ్చు.