ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో ఒక్క సారిగా తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆయన బీజేపీ లోకి వెళ్లడం ఖాయం అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఆయన రేపు ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను కలువనున్నారు అని వార్తలు వస్తుండడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఆయన బీజేపీ లోకి వెళ్లడం ఖాయం అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఢిల్లీ కి వెళ్లడానికి ముందు ఆయన మరొక కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తో ఫోన్ లో మాట్లాడటం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలను బీజేపీ లోకి తీసుకెళ్లి పోతున్నారని రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పై కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. రేపు జరిగే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం భేటీ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేమి ఉందని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అయినా కనీసం కాంగ్రెస్ నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయిలో మార్చి ఉంటే బాగుండేదని, కానీ అలా జరగలేదని , భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ తిరిగి లేచే అవకాశం లేదని ఆయన అంటున్నారు.
జగ్గారెడ్డి గతంలో టీఆర్ఎస్ పార్టీ మీద ఒంటి కాలుతో లేచి పోరాడేవాడు. కానీ 2018 ఎన్నికలకు ముందు ఆయన మీద కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన కేసుల తర్వాత, ఆయన వైఖరి కొంచెం మారినట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ మీద ఏ విధమైన తీవ్ర వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడుతున్నాడు. పైగా కేసీఆర్ మీద కొన్ని సానుకూల వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి కేసీఆర్ చెంతకు చేరతాడా అన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి జగ్గారెడ్డి ని బీజేపీలోకి లాగడానికి ప్రయత్నిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది.