తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ పదవి కోసం ఆశిస్తున్న కొంతమంది నాయకులు చేస్తున్న ప్రహసనాలు చూస్తున్నాం. తాను కూడా ఈ పదవి రేసులో ఉన్నానని ఎప్పట్నుంచో చెబుతూ వస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీకి యువనాయకత్వం అవసరమనీ, తనకు బాధ్యతలు ఇస్తే రాష్ట్రమంతా తిరిగి పార్టీకి అధికారం తీసుకుని వస్తానని ఎన్నికల ముందే చెప్పారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ లో ప్రస్తుతం మొదలైన ఈ అలజడిని పట్టించుకునే పరిస్థితుల్లో హైకమాండ్ ఉందా… అంటే, లేదనే అంటున్నాయి పార్టీ వర్గాలు.
ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ తప్పుకుంటా అంటున్నారు. ఆయన్ని ఎంతమంది బుజ్జగించినా వినడం లేదు. ఈ లొల్లి ఇంకా ఒక కొలీక్కి రాలేదు. కాబట్టి, ఇప్పటికిప్పుడు టి. కాంగ్రెస్ ను చక్కదిద్దేంత ప్రత్యేక శ్రద్ధను హైకమాండ్ పెడుతుందా అంటే అనుమానమే. ఇదే సమయంలో, టీ పీసీసీకి సంబంధించి హైకమాండ్ దగ్గర రెండు ప్రతిపాదనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించిన చర్చ సద్దుమణగగానే… తెలంగాణలో కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకానికి రంగం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అధిష్టానం దృష్టిలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా ఉన్నట్టుగా సమాచారం. వారిలో మొదటిది… మాజీ మంత్రి శ్రీధర్ బాబు పేరు! ఆయనకు రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా సిఫార్సు చేసినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక, రెండోది… అందరూ ఊహించినట్టుగానే రేవంత్ రెడ్డి. రాష్ట్రలో పార్టీ కార్యకర్తలతోపాటు, కొంతమంది నాయకులు కూడా ఆయనకే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నివేదిక కూడా కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఉందట! త్వరలోనే ఈ ఇద్దరికీ హైకమాండ్ నుంచి పిలుపు వస్తుందనీ, ఎవరో ఒకర్ని హైకమాండ్ అధ్యక్షునిగా నియమిస్తుందని అంటున్నారు. ఈలోగానే రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అధిష్టానం తనను బుజ్జగించేందుకు పిలుస్తుందనీ, ఆ సందర్భంగా పీసీసీ బాధ్యతలు ఇవ్వాలని ఆయన కోరే అకాశం ఉందనే చర్చా జరుగుతోంది. పీసీసీకి సంబంధించి అయితే ఆ ఇద్దరి పేర్లే హైకమాండ్ పరిశీలనలో ఉన్నాయట!