సినిమా వ్యాపారంలో శాటిలైట్ కీలకం అయిపోయింది. శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రూపంలో నిర్మాతకు భారీ మొత్తం అందుతోంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా – శాటిలైట్ రూపంలో సగం సేఫ్ అయిపోవొచ్చు. అయితే హీరోలందరికీ ఈ మార్కెట్ ఉండదు. స్టార్ డమ్ ఉన్నవాళ్లకు, మినిమం గ్యారెంటీ హీరోలకూ, క్రేజీ కాంబినేషన్లో రూపొందే సినిమాలకు మాత్రమే శాటిలైట్, డిజిటల్ మార్కెట్ ఉంది. అయితే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాలకు అనూహ్యమైన శాటిలైట్, డిజిటల్ రైట్స్ వస్తున్నాయి. జయ జానకీ నాయక నుంచి బెల్లంకొండకు శాటిలైట్ డిమాండ్ ఏర్పడింది. కవచం, సాక్ష్యం సినిమాలు ఫ్లాప్ అయినా – శాటిలైట్ హక్కుల రూపంలో నిర్మాతకు భారీ మొత్తం లభించింది. ఇప్పుడు `రాక్షసుడు` కీ అదే జరిగింది. ఈ సినిమా విడుదలకు ముందే హిందీ డబ్బింగ్, తెలుగు శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ రెండిటి రూపంలో దాదాపుగా 18 కోట్లు వచ్చాయని చిత్రబృందమే చెబుతోంది. బెల్లంకొండ మార్కెట్, తను కొడుతున్న హిట్లతో పోల్చి చూస్తే రూ.18 కోట్లన్నది పెద్ద మొత్తమే. ఈమధ్య బెల్లంకొండ సినిమాలు తరచూ పల్టీకొడుతున్నా – `రాక్షసుడు` సినిమా ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఆశ్చర్యకరమే. ఇది కేవలం హైప్ కోసం నిర్మాతలు చెబుతున్న అంకెలా? లేదంటే నిజంగానే బెల్లంకొండకు అంత స్టామినా ఉందా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. అయితే… బెల్లంకొండ నటించిన సినిమాల్ని హిందీలో డబ్ చేస్తే… వాటి వ్యూవర్ షిప్ చాలా బాగుంది. పెద్ద హీరోల సినిమాలకు తలదన్నే రీతిలో.. వ్యూస్ సంపాదిస్తున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకునే హిందీ డబ్బింగ్ రైట్స్‌కి ఆ స్థాయిలో డబ్బులు వచ్చి ఉంటాయి. అయితే.. ఇదేం శాశ్వతం కాదు. బెల్లంకొండ ఈసారి హిట్టు కొట్టకపోతే – హిందీ డబ్బింగు మార్కెట్ కూడా పడిపోయే ప్రమాదం ఉంది.