దక్షణాది రాష్ట్రాల్లో పార్టీకి గట్టి పునాదు వేసే వ్యూహాన్ని భాజపా ఇప్పట్నుంచే తెర మీదికి తెచ్చేస్తోంది. కర్ణాటక తరువాత తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పుడు, తమిళనాడులో కూడా ఏం చెయ్యాలా అనే సమాలోచనలు ప్రారంభించినట్టు సమాచారం. అయితే, ఇతర దక్షణాది రాష్ట్రాలతో పోల్చితే, తమిళనాట రాజకీయలు భిన్నంగా ఉంటాయి. పైగా, అక్కడ భాజపా మీద ప్రజల్లో వ్యతిరేకత కూడా తీవ్రంగానే ఉంది. అయినాసరే, గడచిన ఎన్నికల్లో వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకోవడం కోసం భాజపా కూడా రంగంలోకి దిగి ఓటమిపాలైంది. మోడీ 2.0 హవా తమిళనాడులో వర్కౌట్ కాలేదు. దీంతో, భవిష్యత్తులో అక్కడ వికశించాలాంటే ఏం చెయ్యాలా అనే చర్చ భాజపా వర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో తెరమీదికి వస్తున్న ప్రతిపాదన… సూపర్ స్టార్ రజనీకాంత్ తో భాజపా పొత్తు..!
ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తానంటూ హడావుడిగా ట్రైలర్ రిలీజ్ చేసి, ఆ తరువాత అసలు సినిమా ఊసెత్తక సైలెంట్ అయిపోయారు రజనీకాంత్. ఒకదశలో ఆయన భాజపాతో చేతులు కలుపుతారనే అభిప్రాయమూ వ్యక్తమైంది. అయితే, ఇప్పుడు తమిళనాడులో భాజపా ఓటమిపై సమీక్షలు జరుగుతున్నాయి. డివిజన్లవారీగా ఓటమికి గల కారణాలపై లోతుగా చర్చించి, భాజపా జాతీయ నాయకత్వానికి నివేదికలు పంపుతున్నారు. ఈ నివేదికల్లో కామన్ గా ఉన్న ప్రతిపాదన ఏంటంటే… రజనీకాంత్ తో పొత్తు పెట్టుకోవాల్సిందేనని! రాష్ట్రంలో భాజపా అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం, అన్నా డీఎంకే కూటమి నుంచి సరైన సహకారం అందకపోవడం… ఇలాంటి కొన్ని అంశాలను ఓటమికి కారణాలుగా చెప్పుకుంటున్నారు.
రాష్ట్రంలో భాజపా బలపడాలంటే, స్థానికంగా బలమైన నాయకత్వం అవసరమని రాష్ట్ర నేతలు అంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రాండ్ ఇమేజ్ మీదే పార్టీ నెగ్గుకొస్తున్నా… ఇక్కడికి వచ్చేసరికి స్థానికంగా రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ అవసరమనేది స్థానిక వర్గాల డిమాండ్ గా తెలుస్తోంది. మరి, ఈ నివేదికల్నీ చూశాక… రజనీతో టచ్ లోకి వెళ్లేందుకు జాతీయ నాయకత్వం ప్రయత్నిస్తుందా లేదా అనేది చూడాలి. పైగా, ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తానని రజనీ ఇంతకుముందు ప్రకటించారు కాబట్టి, ఆ భావజాలం భాజపాకి దగ్గరగా ఉంటుంది కాబట్టి, ఆయనతో పొత్తు ప్రయత్నాలు మొదలుపెడితే కచ్చితంగా వర్కౌట్ అవుతాయనేది రాష్ట్ర వర్గాల అభిప్రాయం. మరి, తలైవాతో పొత్తుకు భాజపా సిద్ధపడుతుందా..?