తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీయే అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంత చర్చకు దారి తీశాయో చూస్తున్నాం. ఆయన భాజపాలో చేరేందుకు దారి చూసుకుంటున్నారు కాబట్టే, ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ చాలా అభిప్రాయాలు వినిపించాయి. దీనికి తగ్గట్టుగానే సంగారెడ్డి, భువనగిరి, నల్గొండ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలతో ఆయన ఫోన్లలో మాట్లాడి అభిప్రాయ సేకరణ చేశారనీ, తనతోపాటు మరికొందర్ని కూడా భాజపాలోకి చేర్చే క్రమంలో ఆయన ప్రయత్నాలు ఉంటున్నాయనే ఊహాగానాలు చాలా ఉన్నాయి. సొంత పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేలా మాట్లాడారు కాబట్టి, పార్టీ క్రమశిక్షణ సంఘం నుంచి షోకాజ్ నోటీసు రావడం అనే లాంఛనం పూర్తయిపోతే… రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో అసలు రంగు బయటపడుతుందని అందరూ అనుకుంటున్నట్టుగానే… ఆ సమయం ఇప్పుడు రానే వచ్చేసింది!
రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మెచ్చుకుంటూ మాట్లాడటమంటే, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడినట్టే అనే అభిప్రాయానికి క్రమశిక్షణా సంఘం వచ్చింది. పార్టీతోపాటు, అధ్యక్షుడి ప్రతిష్టను దిగజార్చేలా కోమరెడ్డి వ్యాఖ్యానించారంటూ ఆగ్రహించి, షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
నిజానికి, ఆయనకి షోకాజ్ నోటీసులు ఇవ్వాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్ లో తీవ్ర చర్చ జరిగినట్టుగా సమాచారం. ఇప్పటికిప్పుడు ఆయనకు నోటీసులు జారీ చేస్తే… దాన్ని సాకుగా మార్చుకుని వెంటనే పార్టీ మారిపోయే అవకాశం ఉంటుందని కొంతమంది రాష్ట్ర నేతలు అభిప్రాయపడ్డట్టు సమాచారం. అలాగని, ఉదాసీనంగా వ్యవహరించడమూ మంచిది కాదనే సంకేతాలు హైకమాండ్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడికి అవమానం జరుగుతున్నప్పుడు… ఏ స్థాయి నాయకుడి మీదైనా క్రమశిక్షణ చర్యలు ఉండాలనీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తే, పార్టీలోని బలహీనతగా దీన్ని విశ్లేషిస్తారనే అభిప్రాయం ఢిల్లీ నుంచి వచ్చిందట! రాజగోపాల్ ఉంటారా వెళ్తారా అనేది తరువాత చూసుకుందామనీ, ముందైతే షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిందే అనే సూచనలు పైనుంచి కాస్త బలంగానే వచ్చాయట! రాజగోపాల్ తాను అనుకున్నట్టుగా పార్టీ నుంచి ఎగ్జిట్ ప్లాన్ చేసుకున్నారనీ, అనుకున్నట్టుగా బయట పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. తాజా నోటీసుల నేపథ్యంలో రాజగోపాల్ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.