ఇదేంటీ… సర్వేలు చేసి ఆరా తీయ్యాల్సిన అవసరం ఇప్పుడు సీఎం సాబ్ కి ఏముంది..? కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఇప్పుడు అభిప్రాయ సేకరణ ఎందుకు..? అంటే.. ఉంది, ఆ 18 నియోజక వర్గాల్లో ఉన్న తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతల పనితీరుపై కచ్చితంగా ఆరా తియ్యాల్సిన అవసరం ఉందనేది సీఎం కేసీఆర్ అభిప్రాయంగా తెలుస్తోంది. గడచిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను భాజపా గెలుచుకుంది. సికింద్రాబాద్ మినహా మిగతా మూడు చోట్లా తెరాస మీద బాగా వ్యతిరేకత వ్యక్తమైంది. చివరికి, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా భాజపాకి మంచి ఓట్లు పడ్డాయి. ఈ పరిస్థితిని సీఎం కేసీఆర్ ఈజీగా తీసుకోవడం లేదని సమాచారం! ఓటమికి గల కారణాలపై లోతైన అన్వేషణ జరగాలన్న ఉద్దేశంతో తాజాగా ఓ సర్వే చేయిస్తున్నారట!
హైదరాబాద్ కి చెందిన ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్లతో ఒక బృందానికి ఈ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. లోతైన అధ్యయనం జరగాలంటే ప్రొఫెసర్లే కరెక్ట్ అనేది సీఎం అభిప్రాయంగా తెలుస్తోంది. ఈ బృందం తెరాస ఓటమిపాలైన లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో పర్యటించినట్టు సమాచారం. సికింద్రాబాద్ మినహా, ఇతర లోక్ సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ బృందం పర్యటించింది. వారిది దృష్టికి వచ్చిన ప్రధాన కారణం.. తెరాస నేతల అతి విశ్వాసంగానే తెలుస్తోంది. పార్టీ నుంచి ఖర్చులకు వచ్చిన సొమ్మును కూడా సొంత ఖాతాలో వేసుకున్నవారు కొంతమంది ఉన్నారట! ఆదిలాబాద్ జిల్లాల్లో ఆదివాసీల గొడవలు తెరాసకు ఇబ్బందిగా మారినట్టు గుర్తించారు. రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేల వైఖరిలో మార్పే, ప్రజలకు చిరాకు తెప్పించినట్టుగా తేలిందట. భాజపా అనే ఒక పార్టీ ఉందని కూడా తెలియని గిరిజన తండాల్లో కూడా పెద్ద ఎత్తున కమలం గుర్తుకు ఓట్లు పడ్డాయనీ, దానికి కారణం అక్కడి స్థానిక నేతల్ని ఆ పార్టీ బాగా మేనేజ్ చేసిందని తేలిందట. ఓవరాల్ గా నిర్మల్ జిల్లాలో పెద్ద ఎత్తున తెరాసపై వ్యతిరేకత వ్యక్తమైందనీ, దానికి కారణం స్థానిక ఎమ్మెల్యేల వ్యవహార శైలి అని నివేదికలో తేల్చారట.
మూడో స్థానాల్లో ఓటమికి కారణమైన ఎమ్మెల్యేలు, జిల్లాల్లో ఉన్న మంత్రుల పనితీరు మీద కూడా కేసీఆర్ నివేదిక తెప్పించుకుంటున్నట్టు సమాచారం. రాజకీయ వాతావరణం కాస్త చల్లబడ్డ ఈ సమయంలో, సీఎం సాబ్ ఇలాంటి సర్వే చేయిస్తున్నారని తెలియడం ఇప్పుడు తెరాస వర్గాల్లో చర్చనీయం అవుతోంది. కేసీఆర్ చేతికి సర్వే వచ్చాక… ఆయా జిల్లాలకు చెందిన నేతలపై ఏవైనా చర్యలుండొచ్చు అనే అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. పార్టీ వ్యవహారాలపై కాస్త నిర్లక్ష్యం వహించినా ఫలితం ఇలా ఉంటుందనే ఒక అభిప్రాయాన్ని నేతల్లో కేసీఆర్ కలిగించబోతున్నట్టు సమాచారం.