తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి రాజీనామా చేయడం.. తన సెంటిమెంట్ కు విరుద్ధమంటూ… భీష్మించుకు కూర్చున్న పుట్టా సుధాకర్ యాదవ్.. ఎట్టకేలకు…. తన సెంటిమెంట్‌ను బ్రేక్ చేశారు. తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని… ఈవో అశోక్ సింఘాల్‌కు పంపించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో… నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న టీడీపీ నేతలందరూ రాజీనామాలు చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో వీఐపీ పోస్టు లాంటి టీటీడీ చైర్మన్ పదవి నుంచి వైదొలగేందుకు పుట్టా సుధాకర్ యాదవ్ నిరాకరించారు. అయితే.. ఆయనకు అధికారులు సహకరించడం మానేశారు. ఆయనను టీటీడీ చైర్మన్ గా గుర్తించడం మానేశారు.
అదే సమయంలో..కొన్ని ఆరోపణలూ.. ప్రభుత్వానికి వెళ్లాయి. ఈ క్రమంలో… ఆర్డినెన్స్ ద్వారా..నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారిని తొలగిస్తారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పుట్టా సుధాకర్ యాదవ్.. తన పదవికి రాజీనామా చేసేశారు. ఉదయం దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీవారిని దర్శించుకుని … ప్రస్తుతం ఉన్న పాలకమండలిని ఆర్డినెన్స్ ద్వారా తొలగించి.. కొత్త పాలక మండలి నియమిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన నేపధ్యంలో.. గౌరవంగా తప్పుకోవాలని.. పుట్టా సుధాకర్ యాదవ్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పాలకమండలిసభ్యులు గతంలోనే అనేక మంది రాజీనామాలు సమర్పించారు.
కొత్త పాలకమండలి చైర్మన్ గా… మాజీ ఎంపీ, తన బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు. మిగతా సభ్యులను నియమించలేదు. వారిని కూడా.. రెండు రోజుల్లో నియమించనున్నారు. శనివారం.. వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలక మండలి ప్రమాణం చేస్తుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ఓడిపోయిన తర్వాత గౌరవంగా.. వైదొలగాల్సిన పుట్టా సుధాకర్ యాదవ్.. లేనిపోని వివాదాలు తెచ్చుకుని.. అవమానకరరీతిలో గెంటివేయించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. చివరికి… రాజీనామా చేయాల్సి వచ్చింది.