వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ప్రధాని మోదీకి ఆత్మీయుడిగా మారారు. ఎక్కడ ఉన్నా… గుర్తు పట్టి చనువుగా పలకరిస్తున్నారు. పార్లమెంట్ లైబ్రరీ హాల్లో.. అఖిలపక్ష భేటీ సందర్భంగా… ఓ పక్కన నిలబడి ఉన్న విజయసాయిరెడ్డిని చూసి…ఆగి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చారు మోదీ. ఢిల్లీలో రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ముగిశాక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సమావేశం నుంచి బయటకు వెళ్తున్న సమయంలో పక్కనే ఉన్న విజయసాయిని మోదీ ప్రత్యేకంగా పలకరించారు. హాయ్ విజయసాయి అంటూ కరచాలనం చేశారు.
అఖిలపక్ష సమావేశం ముగిసే సమయంలో జగన్ కోసం విజయసాయి వేచి ఉన్నారు. ఇదే సమయంలో మోదీ తిరిగివెళ్తున్నారు. అమిత్‌షాతో ఏదో అంశంపై సీరియస్‌గా చర్చిస్తూ.. ముందుకు సాగుతున్నారు. అలా వెళ్తున్నప్పుడు.. దూరంగా నిల్చుని నమస్కారం పెడుతున్న విజయసాయి మోదీకి కనిపించారు. వెంటనే.. విజయసాయిని చూసి పలకరించారు.. మోదీ పిలుపుతో పక్కనే ఉన్న విజయసాయి వెంటనే దగ్గరకు వచ్చి అభివాదం చేశారు. ఎంపీగా ఎన్నికయినప్పటి నుంచి విజయసాయిరెడ్డి.. ఢిల్లీ వ్యవహారాలను చక్క బెడుతున్నారు. ఆయన మోదీతో సన్నిహిత సంబంధాలను ఏర్పర్చుకున్నారని.. గతంలోనే పలు సందర్భాల్లో వెల్లడయింది. ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు.. ఆయనకు అపాయింట్మెంట్లు దొరికేవి కాదు కానీ..విజయసాయిరెడ్డి మాత్రం తరచూ పీఎంవోలో కనిపించేవారు. మోదీకి.. వెంకటేశ్వరస్వామి ప్రసాదాలు, చిత్రపటాలు ఇచ్చి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఆ తర్వాత పార్లమెంట్లో మోదీ కాళ్లకు నమస్కారం పెట్టారు.
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం,ప్రధానితో సన్నిహిత సంబంధాలు నెరపడంలో.. విజయసాయి నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. అందుకే .. జగన్మోహన్ రెడ్డి.. ఆయనకు.. పార్లమెంటరీ పార్టీ పదవి ఇచ్చినట్లు చెబుతున్నారు. ఢిల్లీలో విజయసాయిరెడ్డి మాత్రమే పనులు చక్క బెట్టగలరని భావించి… ఆయనను ఢిల్లీకి పంపారు. తన టాలెంట్‌గా విజయసాయిరెడ్డి ప్రధాని వద్దకూడా పలుకుబడి సాధించారు..