రాజ్యసభలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలను తమ వైపుకు లాక్కునేందుకు విస్తృతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుగుదేశం అగ్రనేతలకు సమాచారం అందింది. కమలనాధులకు రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో వీరు ప్రస్తుతం తెలుగుదేశం రాజ్యసభ సభ్యులపై కన్నేశారు. ఇప్పటికే ఇద్దరు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు కాషాయ కండువా కప్పుకునేందుకు అంగీకారం కుదిరిందని కూడా తెలుగుదేశం పార్టీ నేతలకు తెలిసిపోయింది. రాయలసీమకు చెందిన కొంతమంది నేతలను కూడా బీజేపీ అగ్ర నేతలు టచ్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కొన్ని ఆఫర్లు ఇచ్చారు. ఇందులో రాయలసీమకు చెందిన తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేలు, మరికొందరు అగ్ర నేతలు ఉన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నియోజకవర్గంలో ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు ..తమ పార్టీలోకి వస్తే రక్షణ ఉంటుందని… బీజేపీ నేతలు చెబుతున్నారు. దీన్నే పదే పదే బీజేపీ నేతలు కూడా తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేలకు నూరిపోస్తున్నారు. రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లోని నేతలకు ఇలా ఆఫర్లు వచ్చాయని, అంటున్నారు. ఇక ఇటీవల అసెంబ్లీకి వచ్చిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనను బీజేపీలోకి రావాలని కొందరు కోరినప్పటికీ తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాయని, ఇక పార్టీలు మారే అవకాశం ఎక్కడుంటుందని ప్రశ్నించారు. డబ్బులు అవసరమైన వాళ్లే బీజేపీలోకి వెళ్తారని.. తమకు ఆ అవసరం లేదని.. జేసీ ప్రభాకర్ రెడ్డి బుధవారం చెప్పారు.
అయితే త్వరలో ఎంపీలు కాకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది రాయలసీమ నేతలు మాత్రం కాషాయం కండువా కప్పుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా బీజేపీ రాయలసీమ నేతలపై కన్నేసింది. కడప, చిత్తూరు జిల్లా నేతలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన కొంతమంది నేతలతో కూడా సంప్రదింపులు ప్రారంభించారు. ఇందులో కొంతమంది నేతలు తాము పార్టీ మారే ఆలోచనలో లేమని చెప్పగా, మరికొంతమది మాత్రం తాము అనుచరులతో మాట్లాడి చెబుతామని వాయిదా వేశారు. వీరిపైనా క్రమంగా ఒత్తిడి పెంచి మిగాత పనులు పూర్తి చేసే అవకాశం ఉంది.