భారతీయ జనతా పార్టీలోకి చేరగానే టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయి! ఒక్కపూటలో ఎంత మార్పో..! ఆయన టీడీపీని వీడి ఎన్నాళ్లో అయిపోయినట్టుంది! ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సైనికుడిగా పనిచేయాలంటున్నారిప్పుడు. ఇన్నాళ్లూ టీడీపీలో ఉన్నాను కాబట్టి, ఆ పార్టీకి అనుకూలంగా పనిచేశాను అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అవసరం అంటూ పార్లమెంటులో పెద్ద ఎత్తున గళమెత్తిన నేతల్లో సుజనా కూడా ఒకరు కదా! అంతేకాదు, హోదాకి బదులుగా ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు, దాని రూపకల్పనలో కీలకపాత్ర పోషించిందీ ఈయనే కదా. కానీ, ఇప్పుడేమంటున్నారంటే… ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమన్నారు. భాజపా గొంతుక వినిపించారు! ఇంతకీ ఎందుకు పార్టీ మారారంటే… రొటీన్ గా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కోసమని సుజనా చెప్పారు. దేశమంతా మోడీని కోరుకుంటోంది కాబట్టి, ప్రజాభిప్రాయం ప్రకారం తామూ మారాలి కాబట్టి… అంటూ ఆయన పార్టీ మార్పునకు ఒక ప్రజామోద కోణాన్ని ఆపాదించే ప్రయత్నం మొదలుపెట్టేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద గౌరవం ఎప్పటికీ అలానే ఉంటుందనీ, పార్టీకి 2004 నుంచి చాలా కష్టకాలం వచ్చిందనీ, ఆ సమయంలో ఎంత కష్టపడ్డానో అధినాయకుడికి తెలుసన్నారు. ఆ పార్టీ మరోసారి ఎదగాలని కోరుకునేవారిలో తాను ముందుంటానన్నారు! ఆర్థిక ఒత్తిళ్ల వల్ల తాను పార్టీ మారడం లేదనీ, ఈ మధ్యకాలంలో తనపై వచ్చినవి కూడా కేవలం అభియోగాలు మాత్రమే అన్నారు సుజనా చౌదరి! అభియోగాలు వచ్చినప్పుడు దర్యాప్తు చేయడం అనేది సహజమనీ, అలాంటి సమయంలో ఒక సగటు పౌరుడిగా సహకరించాలనీ, తానూ అలానే చేశాను అన్నారు చౌదరి. చట్టం తన పనిని తాను చేసుకుంటూ పోవాలన్నారు. 2004 తరువాత తాను వ్యాపారాలకు దూరంగా ఉంటున్నా అన్నారు.
నిజమే… మరి, టీడీపీలో ఉండగా ఆయనపై దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తుంటే… ఇదంతా ఇప్పటి సొంత పార్టీ భాజపా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగం అంటూ గగ్గోలు పెట్టారు కదా! మరి, ఆరోజున కూడా ఇప్పుడున్న ప్రశాంత చిత్తంతో, సగటు పౌరుడి బాధ్యతను గుర్తెరిగి, సైలెంట్ గా సహకరించి ఉంటే… ఇప్పుడు చెబుతున్న ఈ మాటలకు కొంతైనా విలువ ఉండేదేమో! ఏదైతేనేం.. పార్టీలు వేరు, పార్టీల్లో నాయకులు వేరు అన్నట్టుగా ఇవాళ్ల సుజనా చౌదరి మాట్లాడుతున్నారు. ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి తగ్గట్టు ఉండాలనే ఒక థియరీ చెబుతూ… అభిప్రాయాలూ సిద్ధాంతాలూ లాంటివి కేవలం పార్టీలకు మాత్రమే ఉంటాయనీ, నాయకులకు అవసరం లేదన్నట్టుగా విశ్లేషించారు. భాజపాలో ఈ నాయకులు ఎందుకు చేరుతున్నారో ప్రజలకు తెలుసు. కాబట్టి, దేశం కోసమనీ, రాష్ట్రం కోసమనీ కారణాలు చెబుతుంటే వింటున్నవారికి ఎలా ఉంటుంది..? దేశం కోసం, ప్రజల కోసం జీవితం అనుకున్నప్పుడు… ప్రతిపక్షంలో ఉన్నామా, పదవిలో ఉన్నామా అనే తేడా ఉండకూడదు. ఎక్కడున్నా ప్రజల కోసం పాటుపడొచ్చు.