నలుగురు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారాలని నిర్ణయించుకున్న తర్వాత.. తెలంగాణలోలా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ టెన్ ప్రకారం.. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని విలీనం చేయాలంటూ.. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చారు. ఈ లేఖ ఇచ్చే సమయంలో.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా కూడా వాళ్లతో పాటే ఉన్నారు. అంటే.. ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందన్నమాట. మరి ఇప్పుడు వెంకయ్యనాయుడు ఏం చేయబోతున్నారు..?
ఫిరాయింపులపై కఠినంగా వ్యవహరిస్తున్న వెంకయ్య..!
పార్టీ మారినన రోజే.. ఆ ఫిరాయించిన ప్రజాప్రతినిధి పదవి పోవాలని.. ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు.. అనేక సార్లు… వివిధ కార్యక్రమాల్లో చెప్పారు. అంతే కాదు.. తాను రాజ్యసభ చైర్మన్ అయిన తర్వాత ఇద్దరి పదవిని అలానే ఊడగొట్టేశారు. అందులో.. శరద్ యాదవ్ కూడా ఉన్నారు. అందుకే టీడీపీ రాజ్యసభ సభ్యులు.. ఫిరాయించగానే.. వెంకయ్యనాయుడు అన్న ఈ మాటలే.. సోషల్ మీడియాలోనూ హైలెట్ అయ్యాయి. రాజ్యసభ చైర్మన్గా ఉండే ఉపరాష్ట్రపతి ఇప్పుడు.. తాను అన్నవి మాటలు కాదని… తన విలువలని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిబంధనలు, విలువలు, సంప్రదాయాలను అనుసరించి.. ఆయన ఆ నలుగురు రాజ్యసభ సభ్యులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వెంకయ్యనాయుడు బయట చెప్పిన మాటలకు.. ఆయన చేసిన చేతలకూ.. తేడా లేకపోతే.. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నా ఆయన కూడా మాటల రాజకీయ నాయకుడేనని ప్రజలు తీర్మానించేసుకుంటారు.
పార్లమెంటరీ పార్టీ విలీనం సాధ్యమేనా..?
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా.. గల్లా జయదేవ్ ఉన్నారు. వెంకయ్యనాయుడికి నలుగురు రాజ్యసభ ఎంపీలు విలీన లేఖ ఇచ్చిన తర్వాత… గల్లా జయదేవ్ స్పష్టమైన ప్రకటన చేశారు. తన అధ్యక్షతన ఎలాంటి పార్లమెంటరీ పార్టీ భేటీ జరగలేదని.. ఆ ఎంపీలు ఇచ్చిన లేఖలు విలువ లేదని ఆ ప్రకటన సారాంశం. ఫిరాయింపు ఎంపీలపై వేటు వేయడానికి ఏ క్షణమైనా టీడీపీ నేతలు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాతే అసలు వ్యవహారం నడవనుంది. పార్లమెంటరీ పార్టీ భేటీ జరగడానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. అలాంటి భేటీ ఏదీ జరగలేదని.. గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. రాజ్యసభ చైర్మన్కు.. ఇది కూడా.. చిక్కు ప్రశ్నగానే మిగిలిపోనుంది.
అనర్హతా వేటు పడదని భరోసా రాకుండా ఉంటుందా..?
నిజానికి వెంకయ్యనాయుడుపై అన్ని ఆశలు .. అంచనాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఎందుకటే.. ఆయన కూడా రాజకీయ నాయకుడే. ఆయన చెప్పే ఆదర్శలు, నియమాలు.. అన్నీ ప్రత్యర్థి పార్టీకి వర్తించాలనుకుంటారు కానీ.. తన పార్టీకి కాదు. ఒకవేళ తన పార్టీకి వర్తించాలనుకున్నా.. ఆయన అమిత్ షా, మోడీ సూచనలను జవదాటే పరిస్థితి లేదు. ముందుగానే ప్రణాళిక ప్రకారం.. విలీనం పేరుతో ఇతర వ్యవహారాలను నడుపుతున్నారు కాబట్టి… అనర్హతా వేటు వేసే అవకాశమే లేదన్నది బీజేపీ నేతల అభిప్రాయం. ఈ నలుగురిపై ఎలాంటి వేటు పడదని నిర్దారించుకున్న తర్వాతే… అడుగు ముందుకు వేసి ఉంటారు. అంతిమంగా చూస్తే.. వెంకయ్యనాయుడు.. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నా…. తను చెప్పే విలువల ప్రకారం.. నిర్ణయాలు తీసుకోలేరు.