ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి విదించిన కొన్ని షరతుల వలన కేవలం రెండే రెండు కంపెనీలు టెండర్లు వేశాయి. ఎల్ అండ్ టి మరియు షాపూర్ జీ పల్లోంజి అండ్ కంపెనీ లిమిటెడ్ సంస్థలు వేసిన టెండర్లను సి.ఆర్.డి.ఏ. చీఫ్ ఇంజనీర్ కాశీ విశ్వేస్వర రావు, ప్రొక్యూర్ మెంట్ డైరెక్టర్ ఆంజనేయుల సమక్షంలో నిన్న సాయంత్రం తెరిచారు. అవి కేవలం సాంకేతిక టెండర్లు మాత్రమే. ఆ రెంటిలో ఏ కంపెనీకి అటువంటి తాత్కాలిక భవనాలను వేగంగా మరియు నాణ్యతగా నిర్మించడంలో అనుభవం ఉందో పరిశీలిస్తారు. ఒకవేళ రెంటికీ తగిన అర్హత, అనుభవం ఉన్నట్లయితే ఈనెల 10న ఫైనాన్సియల్ బిడ్డింగ్ టెండర్లను తెరుస్తారు. వాటిలో ప్రభుత్వం వేసిన నిర్మాణ అంచనా రూ. 180 కోట్ల కంటే ఏ సంస్థ తక్కువకు ఈ పని చేయడానికి ముందుకు వస్తుందో దానికే ఈ పనిని అప్పగిస్తారు.
సచివాలయంలో ఒక బ్లాకుకి రెండేసి భవనాల చొప్పున మూడు బ్లాకులలో మొత్తం ఆరు భవనాలను ‘ప్రీ-ఫాబ్రికేటడ్’ పద్దతిలో నిర్మించాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టు దక్కించుకొన్న సంస్థతో 10వ తేదీనే ఒప్పందం చేసుకొని అదే రోజున వర్క్ ఆర్డర్ కూడా అందజేయబడుతుంది. ఒప్పందం ప్రకారం ఆరు నెలలోగా ఆరు భవనాలను నిర్మించి, ప్రభుత్వానికి అప్పగించవలసి ఉంటుంది. నాలుగు నెలలోనే నిర్మాణం పూర్తి చేయగలిగితే నిర్మాణ వ్యయంలో 2 శాతం, ఐదు నెలలలో పూర్తి చేయగలిగితే ఒక్క శాతం చొప్పున అదనంగా చెల్లించబడుతుంది ఒకవేళ ఆరు నెలల కంటే ఆలస్యమయితే నిర్మాణ వ్యయంలో 10 శాతం జరిమానా విధించబడుతుంది.
నిర్మాణ స్థలాన్ని చదును చేయడం, అక్కడికి యంత్రాలను, నిర్మాణ సామాగ్రిని, కార్మికులను తరలించడం, ప్రీ ఫాబ్రికేటడ్ గోడలను, కప్పులను సిద్దం చేసుకోవడం వంటి అనేక పనులన్నీ ఏకకాలంలో, చాలా పద్ధతి ప్రకారం చేయవలసి ఉంటుంది. అప్పుడే గడువులోగా నిర్మాణం పూర్తి చేయడం సాద్యం అవుతుంది. లేకుంటే బారీగా జరిమానా చెల్లించవలసి వస్తుంది కనుక కాంట్రాక్టు దక్కించుకొన్న కంపెనీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే చాలా కంపెనీలు టెండర్లు వేసేందుకు సాహసించలేదు.