2019 ఎన్నికలలో జనసేన పార్టీ కేవలం ఒకే సీటు సాధించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. మిగతా పార్టీలతో పోలిస్తే డబ్బు , మద్యం తో కూడిన రాజకీయాలు చేయకపోవడం, రాజకీయ పలుకుబడి లేని సామాన్యులకు టికెట్లు ఇవ్వడం వంటి ప్రయోగాలు ఫలితాలను ఇవ్వక పోవడంతోనే జనసేన కేవలం ఒక సీటు తోనే సరిపెట్టుకోవలసి వచ్చింది అని జనసేన అభిమానులు చెబుతూ వస్తున్నారు. అయితే జనసేన ఫలితాలపై స్పందించారు మెగా బ్రదర్ నాగబాబు.
నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన నాగబాబు కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు చేతిలో ఓడిపోయారు. అయితే నాగబాబు జనసేన ఎన్నికల్లో విఫలం కావడాన్ని విశ్లేషించారు. తమ పార్టీ నిజాయితీతో కూడిన రాజకీయాలు చేసినప్పటికీ, ఆ కారణం చేత ప్రజల్లో తమ పార్టీ మీద మంచి అభిప్రాయమే ఉన్నప్పటికీ, చంద్రబాబు మీద వ్యతిరేకత తమ పార్టీని దెబ్బ తీసిందని నాగ బాబు వ్యాఖ్యానించారు. తమ పార్టీకి చెప్పుకోదగిన సీట్లు వస్తే తాము చంద్రబాబుకు మద్దతు ఇచ్చి ఆయనని మళ్లీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రజలు భావించారని నాగ బాబు వ్యాఖ్యానించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలన మీద ఎంతగానో విసిగి పోయిన ప్రజలు, చంద్రబాబు కి ఓటు వేయకూడదని నిర్ణయించుకోవడమే కాకుండా జనసేనకు ఓటు వేస్తే ఎక్కడ పొరపాటున చంద్రబాబుకు లాభం చేకూరుతుందో అన్న భయంతో జనసేనకి ఓటు వెయ్యలేదని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తాము తెలుగుదేశం పార్టీకి అనుబంధ పార్టీ అన్న విమర్శలను తిప్పి కొట్టాలేకపోవడం జనసేన కు నష్టం చేసింది అని అర్థం అవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వెళ్ళడు అని రాజకీయాలలోనే కొనసాగుతాడని నాగబాబు వ్యాఖ్యానించారు. అలాగే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉండవచ్చు అనే అభిప్రాయాలు కొంత మంది ప్రజలలో ఉన్నప్పటికీ, తాను దానిపై ఇప్పుడే వ్యాఖ్యానించలేను అని చెప్పారు.
మరో వైపు చంద్రబాబు కూడా ఆ మధ్య , జనసేన పార్టీ వల్లే తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలు అవతల పార్టీల మీద నెపం వేయడం బదులుగా తమ పార్టీ తప్పు లని మరింత నిర్మొహమాటంగా విశ్లేషించుకుంటే అది పార్టీ భవిష్యత్తు కు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.