ఆడిటర్ నుంచి రాజకీయ నేతగా మారిన విజయసాయిరెడ్డి.. పాతతరం నేతలకు.. కొత్తగా రాజకీయాలు ఎలా చేయాలో నేర్పుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహాల్లో అన్నీ తానై వ్యవహరించిన ఆయన ఇప్పుడు.. వైసీపీ గెలిచిన తర్వాత కూడా.. తన రాజకీయ ప్రజ్ఞాపాటవాలను ఘనంగా చాటుకునేందుకు ఏమాత్రం సంకోచించడం లేదు. తాజాగా.. టీడీపీలో ఏర్పడిన సంక్షోభంలో.. విజయసాయిరెడ్డి పాత్ర కీలకమని ఢిల్లీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లుగానే ఆయన ఢిల్లీలోనే మకాం వేసి. తెరవెనుక వ్యవహారాలు చక్కబెడుతున్నారు. అదే సమయంలో.. ట్విట్టర్‌లో మాత్రం.. చంద్రబాబే.. టీడీపీ ఎంపీలను.. బీజేపీలోకి పంపారంటూ.. ట్వీట్లు చేసేస్తున్నారు.
ఆపరేషన్ ఎల్లో వెనుక కీలక పాత్రధారి విజయసాయిరెడ్డి..!
తెలుగుదేశం పార్టీ ఎంపీల గుట్టుముట్లు.. ముఖ్యంగా.. రాజ్యసభ ఎంపీల గుట్టుముట్లన్నీ విజయసాయిరెడ్డికి బాగా తెలుసు. ఎక్కడ నొక్కితే వారు బెండవుతారో.. ఆయనకు తెలుసు. అందుకే.. కొంత కాలం నుంచి.. అంటే.. ఎన్నికల ఫలితాల రాక ముందు నుంచే.. రాజ్యసభ సభ్యులను టార్గెట్ చేశారు. వారిని ఎలా.. దారిలోకి తేవాలో ప్రణాళికలు సిద్దం చేశారు. ఆ మేరకు.. ప్రధానమంత్రి కార్యాలయం నుంచే కథ నడిపారు. ఎన్నికల ఫలితాలకు ముందు విజయసాయిరెడ్డి… ప్రధానికి ఓ లేఖ రాశారు. ఉత్తరాఖండ్‌లో ఓ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్నది ఆ లేఖ సారాంశం. వెంటనే కేంద్రం.. ఆ లేఖను ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీకి పంపిన పీఎంవో.. తక్షణం విచారణ జరిపించాలని ఆదేశించింది. అసలేం జరిగిందంటే.. ఆ విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణంలో..సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్ కీలకంగా వ్యవహరించింది. దాన్నే పట్టుకున్న విజయసాయిరెడ్డి విచారణకు ఆదేశించేలా చేయగలిగారు. ఇలాంటివి.. దాాదాపు… అందరూ ఎంపీల మీద ప్రయోగించాు. అంటే.. బీజేపీ తరపున ఆయనే ఆపరేషన్ జరిపారన్నమాట.
బీజేపీ కోసం.. ఢిల్లీలోనే మకాం వేసిన విజయసాయిరెడ్డి..!
మూడు రోజుల కిందట.. ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమంలో… పార్లమెంట్‌లో విజిటర్స్ గ్యాలరీలో.. సీఎం రమేష్‌తో.. దాదాపుగా గంటన్నర పాటు విజయసాయిరెడ్డి చర్చలు జరిపారు. ఇది బహిరంగంగా జరిగింది. ఆ తర్వాతే.. ఎంపీలందరూ.. బీజేపీలో చేరారు. అక్కడే తెలిసిపోతుంది.. విజయసాయిరెడ్డి… వ్యవహారం మొత్తం నడుపుతున్నాడని.. ఇక ఆ ఎంపీలు… టీడీపీపీని బీజేపీలో విలీనం చేసిన తర్వాత.. అప్పటిదాకా… విషం చిమ్ముకున్న విజయసాయిరెడ్డి, సీఎం రమేష్ చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తున్నారు. విందులు ఆరగిస్తూ.. ఫోటోలకు ఫోజులిస్తున్నారు.
ట్విట్టర్‌లో… చంద్రబాబుపై నెపం నెట్టేస్తున్న విజయసాయిరెడ్డి..!
ఓ వైపు టీడీపీ రాజ్యసభ ఎంపీలను.. బీజేపీలోకి చేర్చడంలో కీలకంగా వ్యవహరించడమే కాదు.. ఢిల్లీలో వారితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ.. కూడా.. ట్విట్టర్‌లో విభిన్నమైన విమర్శలు చేస్తున్నారు. ఆ ఎంపీలను చంద్రబాబే.. బీజేపీలోకి పంపారని విమర్శలు చేస్తున్నారు. తనపై కేసులు రాకుండా.. లాబీయింగ్ చేసుకునేందుకు కోవర్టులుగా.. వారిని.. బీజేపీలోకి పంపారని ట్వీట్లు చేస్తున్నారు. ఓ వైపు ఢిల్లీలో విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయం.. మరో వైపు ట్విట్టర్ వేదికగా.. ఆయన చేస్తున్న విమర్శలు చూసి.. రాజకీయాల్లో పండిపోయిన వారు కూడా నోరెళ్లబెట్టాల్సి వస్తోంది.