పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి చేశామనీ, రూ. 55 వేల కోట్లకు అంచనాలు పెంచేశామంటూ మంత్రులు విమర్శలు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ. ఆ అవినీతిని తగ్గిస్తామనీ, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్ని ఆడిట్ చేస్తారా, రివర్స్ టెండరింగ్ చేస్తారా, జుడీషియల్ కమిషన్ వేస్తారా… ఏం చేసినా పారదర్శంగా చేస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. రూ. 55 కోట్ల అంచనాలను తాను సొంతంగా వెసింది కాదనీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చేసిందన్నారు. పునరావాసం మీద, భూసేకరణ మీదా ఈ కమిటీ దాదాపు రెండేళ్లు పనిచేసి నివేదిక ఇచ్చిందన్నారు. దీన్లో తప్పొప్పులు ఏవైనా ఉంటే శాసన సభలో చెప్పాలనీ, బడ్జెట్ ప్రసంగంలో ప్రజలకు వివరించండని ప్రభుత్వాన్ని కోరారు దేవినేని.
వాస్తవాలు వేరే విధంగా ఉంటే… తాము అధికారంలోకి వచ్చాం కాబట్టి అంచనాలు తగ్గిస్తాం, పెంచిన అంచనాల్లో అవినీతి జరిగిందని మంత్రులు శాసనసభలో మాట్లాడుతున్నారన్నారు ఉమ. రెండేళ్లపాటు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ కసరత్తు చేసి వేసిన అంచనాలు ఏమేరకు తగ్గిస్తారో అని అభిప్రాయపడ్డారు. నిన్ననే ముఖ్యమంత్రి జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ కి వెళ్లారనీ, అక్కడ కాంక్రీట్ పనులు ఏ ధరకి జరుగుతున్నాయో ఆయన తెలుసుకోవాలనీ… ఆ తరువాత, పోలవరంలో తమ ప్రభుత్వం చేపట్టిన పనుల ధరలతో పోల్చి చూసుకోవాలని దేవినేని సలహా ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులు, పోలవరం ఖర్చులు చక్కగా ఎనలైజ్ చేసి, రివ్యూ చేసి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. దీంతోపాటు, ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నప్పుడు… కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే భారత్-పాకిస్థాన్ ల మాదిరిగా రెండు రాష్ట్రాలూ నీళ్ల కోసం గొడవలు పడాల్సి వస్తుందన్నారనీ, ఆ వ్యాఖ్యపై ఇప్పుడు జగన్ వివరణ ఇవ్వాలని కోరారు.
గోదావరికి వరదలు వచ్చేలోగా ప్రభుత్వం స్పందించాలన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఏడు ముంపు మండలాలను మన రాష్ట్ర భూభాగంలోకి తేవడం వల్ల పోలవరం కల సాకారమైందని దేవినేని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకుండానే జగన్ ఢిల్లీ వెళ్లారనీ, పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అని ప్రకటించారన్నారు. దాంతో పోలవరంలో జరుగుతున్న పనులన్నీ ఆగిపోయాయన్నారు. తన మీద కోపంతోనో, గత టీడీపీ ప్రభుత్వంపై ఆగ్రహంతోనో పోలవరం ప్రాజెక్టు పనులని నిర్లక్ష్యం చెయ్యొద్దన్నారు. జరిగిందంటున్న అవినీతిపై వెంటనే నిరూపించాలన్నది దేవినేని డిమాండ్. మరి, అంచనాలను టీడీపీ పెంచేసిందన్న జగన్ సర్కారు… దానిపై ఎలాంటి విశ్లేషణ చేస్తుందో వేచి చూడాలి.