తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది
డ్రయినేజీ స్కీము లేక డేంజరుగా మారుతోంది.
ఈ మాటలు అన్నది అలనాటి ప్రముఖ కవి పురిపండా అప్పలస్వామి. ఆయన అప్పట్లో చెప్పినా ఇప్పటికీ మరింత వాస్తవాలుగా మారుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడ పరమ భక్తులుగా మారారు. కానీ దాని వల్ల ప్రజాధనం పక్కదారిపడుతోంది. ముఖ్యమంత్రి తన భక్తి ప్రపత్తులు చాటుకునేందుకు ఎకరా రూపాయి వంతున ఓ స్వామీజీకి రెండు ఎకరాలు ఇవ్వడం అంటే ఏమనుకోవాలి?
ఇంతకన్నా భలే మంచి చౌకబేరమ్ ఏమిటి వుంటుంది? ప్రభుత్వం హైదరాబాద్ లో రెండు ఎకరాల స్థలాన్ని కేవలం రెండు రూపాయిలకే విశాఖ శారదా పీఠానికి ఇచ్చేసింది. ఎంతటి ఔదార్యం? తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణేతరులు అంటే ఒంటికాలి మీద లేచిన నాయకులు, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన స్వామీజీకి అది కూడా ఎకరా రూపాయికే భూమి కేటాయించారు. ఎంతలో ఎంత మార్పు?
ఇప్పటికే ఇదే స్వామీజీ చేతిలో హైదరాబాద్ ఫిలిం నగర్ దైవ సన్నిధానం వుంది. ఎక్కడ తెలంగాణ ప్రభుత్వం టేకోవర్ చేసుకుంటుందో అని, మురళీ మోహన్ తదితర సినిమా జనాలు దూరాలోచన చేసి, విభజన సమయంలో దైవ సన్నిధానాన్ని విశాఖ శారదాపీఠం చేతిలో పెట్టేసారు. ఇప్పుడు అదే స్వామిజీ హైదరాబాద్ లో ఆశ్రమం కట్టుకోవడానికి ప్రభుత్వమే స్థలం ఇచ్చేసింది.
నిజానికి శారదాపీఠాలు రెండురకాలు. ఆదిశంకరాచార్య స్వయంగా నెలకొల్పినవి ఒకరకం. కంచి పీఠం లాంటివి ఇవి. ఇవి కాక, సెల్ఫ్ స్టయిల్డ్ మరి కొన్ని. అంటే ఎవరైనా సన్యాసం తీసుకుని, తనకు తానే మఠం పెట్టుకుని, దానికి శారదాపీఠం అని పేరు పెట్టుకోవడం. విశాఖ పీఠం ఇలాంటి రెండో రకానికి చెందినది.
సరే, ఎవరి పీఠం వారిది. వారి ఇష్టం. అందులో తప్పులేదు. కానీ సన్యాసి అంటే మనసును సత్యాన్వేషణ దిశగా నడిపేవాడు. ఆడంబరాల జోలికి పోని వారు. కానీ చిత్రంగా, సన్యాస దీక్ష తీసుకుంటున్నారు అని చెప్పి, విజయవాడలో అంత హంగామా చేయడం చిత్రమైన విషయం. సన్యాసి అంటేనే ఆడంబరాలకు దూరం. కానీ సన్యాస దీక్ష తీసుకుంటూ అంత ఆడంబరాలు ఏమిటొ? స్వాముల వారికే తెలియాలి.
సాధారణంగా స్వాములకు పూర్వం ఒకటే పీఠం వుండేది. బ్రాంచ్ ఆఫీసులు వుండేవి కావు. స్వాములు పర్యటనకు వచ్చినా ఎక్కడో ఒక దగ్గర బస చేసేవారు తప్ప, ప్రతి చోటా ఇలా బ్రాంచ్ ఆఫీసులు వుండేవి కాదు. ఇప్పటకీ దేశంలో వున్న అనేక మఠాల పరిస్థితి ఇదే. అయితే చాలా మఠాలు ఇప్పుడు ప్రతి చోటా గుళ్లు భక్తులతో నిర్మింపచేయడం, వాటిని తమ నిర్వహణలో వుంచుకోవడం, అలాగే విరాళాలతో భవనాలు నిర్మించి, వాటిని మఠం ఆధీనంలోకి తీసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేఫడుతున్నాయి. ఆ విధంగా మఠాలకు ఆస్తులు పెంచే కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ప్రజాస్వామ్యం ఇది. ప్రభువుల చిత్తం ప్రకారం వుంటాయి వ్యవహారాలు. ప్రజలు ఎన్నుకునే వరకే కానీ ప్రభువుల నిర్ణయాలను ప్రభావితం చేయగలిగిన స్థాయి వారికి లేదు.