ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం పక్కనే ఉన్న ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అది ప్రతిపక్ష నివాసంగా కేటాయించాలని… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన.. విజ్ఞప్తికి అసలు సమాధానం ఇవ్వకుండానే… ఆ వేదికను స్వాధీనం చేసుకుంది. అక్కడే కలెక్టర్ల సమావేశం పెట్టాలని కూడా నిర్ణయించారు. ఈ లోపు.. చంద్రబాబు సామాన్లు ఏమైనా ఉంటే.. వాటిని రోడ్డుపై పడేశారు. కనీసం ఖాళీ చేయమని నోటీసు కూడా ఇవ్వలేదు. దీనిపై విమర్శలు వచ్చే సరికి.. మంత్రి బొత్స.. సంచలన విషయాలంటూ.. కొన్ని మీడియాకు చెప్పారు.
ప్రజావేదికకు సీఆర్డీఏ అనుమతి లేదట..!
ప్రజావేదికపై సీఆర్డీఏ అధికారులు తనకు నివేదిక అందజేశారని.. బొత్స ప్రకటించారు. అందులో.. కృష్ణానది కరకట్టలో నిర్మాణానికి అనుమతి నిరాకరించినట్లు సీఆర్డీఏ అధికారులు చెప్పారట. అప్పటి మంత్రి నారాయణ మాటతో టెండర్లు లేకుండానే పనులు అప్పగించినట్లు అధికారులు చెప్పారంటున్నారు. అంటే.. అనుమతి లేకుండా.. ప్రజావేదికను ప్రభుత్వ ధనం పెట్టి నిర్మించారని… అక్రమ కట్టడం అని నేరుగా చెప్పినట్లయింది. అంతే కాదు.. చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూడా అక్రమ కట్టడమేనని.. వాటిని ఏం చేయాలన్నది త్వరలో నిర్ణయిస్తామని బొత్స హెచ్చరింంచారు.
మరి అక్రమ కట్టడంలో కలెక్టర్ల సమీక్షలు ఎలా పెడతారు..!
బొత్స రాజకీయ తెలివి తేటలతో.. అలాంటి నివేదిక ఇప్పించుకున్నారో.. లేక.. తానే స్వయంగా ప్రకటించుకున్నారో కానీ.. 24వ తేదీన… అందులోనే… ముఖ్యమంత్రి కలెక్టర్ల మీటింగ్ పెట్టబోతున్నారు. అక్రమ కట్టడం అని సీఆర్డీఏ తేల్చిన తర్వాత.. అదే కట్టడంలో.. ముఖ్యమంత్రి అధికార కార్యక్రమాలను నిర్వహించడం.. నైతికత కాదు. అక్రమ నిర్మాణాలను ప్రొత్సహించినట్లు అవుతుంది. బొత్స ఈ విషయాన్ని అంచనా వేయలేక.. అలా అనేశారేమో కానీ.. ఇప్పుడు.. అక్రమ కట్టడంలో ప్రభుత్వ సమీక్షలెలా చేస్తారని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఆయన మళ్లీ ఎదురుదాడి విధానమే అవలంభించకతప్పదేమో.. ?
ఖాళీ చేసే సమయం కూడా ప్రతిపక్ష నేతకు ఇవ్వరా..?
ప్రజావేదికను.. తన నివాసంగా గుర్తించాలని చంద్రబాబు లేఖ రాశారు. దానికి ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. కనీసం. ఖాళీ చేయాలనే నోటీసులు కూడా పంపలేదు. రెండు రోజుల్లోనే.. మొత్తం వ్యవహారం.. నడిపించేశారు. వైఎస్ చనిపోయిన తర్వాత.. కనీసం ఆరు నెలల పాటు.. ఏపీ సీఎం అధికారిక గృహంలోనే.. వైఎస్ ఫ్యామిలీ ఉంది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రోశయ్య ప్రమాణం చేసినప్పటికీ.. ఆయన కోసం గృహాన్ని వైఎస్ జగన్ ఖాళీ చేయలేదు. నోటీసులు ఇచ్చీ..ఇచ్చీ.. చివరికి అతి కష్టం మీద… జగన్ ను ఖాళీ చేయించగలిగారు. అదే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తూ… ప్రతిపక్ష నేతను అవమానించడానికే.. ఇలాంటివన్నీ చేస్తున్నారని.. తమిళనాడు తరహా రాజకీయాలు తెస్తున్నారని మండి పడుతున్నారు.