వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపై యుద్ధం ప్రారంభించారు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలంటూ.. ఆయన ప్రతి సమావేశంలోనూ అధికారులను… బతిమాలడం దగ్గర్నుంచి ఆదేశించడం వరకూ చేస్తున్నారు. అంతేనా… అలాంటివి ఏమైనా బయటపెడితే.. సన్మానాలు చేస్తామని ఆఫర్లు కూడా ఇస్తారు. ప్రాజెక్టులపై సమీక్షలోనూ అదే చేశారు. ఈ క్రమంలో.. ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ” చెడిపోయిన వ్యవస్థను బాగు చేసుకునేందుకు తపిస్తున్నాను. ఇవన్నీ పట్టించుకోకుండా కళ్లు మూసుకోవాలని నాకు కొందరు సలహాలు ఇస్తున్నారు..” అని ప్రకటించుకున్నారు. దీంతో ఉలిక్కిపడాల్సిన పరిస్థితి ప్రజల వంతయింది.
జగన్‌కు సలహాలిచ్చే స్థాయి పార్టీలో ఇద్దరు, ముగ్గురికే ఉంది..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు.. ఎమ్మెల్యేలు కాదు.. మంత్రులు వెళ్లడానికి కూడా అవకాశం లేదు. ఆయన చుట్టూ.. ఓ వలయం ఉంటుంది. ఆయనను దాటుకుని వెళ్లడానికి ఆవకాశం లేదు. ఆయన ఎవరి మాటలనూ వినరు. ఇక సలహాలు అయితే అసలు తీసుకోరు. అంతకు ముందు పీసీసీ చీఫ్ గా చేసి.. సీఎం రేసులో ఉన్నానని గొప్పగా చెప్పుకున్న బొత్సను… పార్టీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి.. ఒక్కటంటే.. ఒక్క విషయంలోనూ.. జగన్మోహన్ రెడ్డి సలహా అడగలేదు. చివరికి విజయనగరంలో.. ఎవరికి ఎక్కడ టిక్కెట్ ఇవ్వాలన్న విషయాన్ని కూడా… బొత్సకు సంబంధం లేకుండానే చేసేశారు. జగన్‌కు సలహాలు అడగడం కానీ.. తీసుకోవడం కానీ.. ఇష్టం ఉండదు. దానికి చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఇద్దరు, ముగ్గురు వీఐపీలు ఈ కేటగిరీ లేదా.. కోటరీ కిందకు వస్తారు.
కళ్లు మూసుకోవాలని ఉన్నతాధికారులు సలహా ఇచ్చారా..?
వీరెవరైనా… ప్రభుత్వ అవినీతిని వెలికి తీస్తామంటే.. వద్దు సైలెంట్‌గా ఉందామని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే… గత ప్రభుత్వంలో ఏదైనా సందు దొరికితే… చాలు.. చంద్రబాబును ఇరికించేయాలనేది.. వీళ్ల ప్రణాళిక. అందుకే.. ఎవరూ.. ఆ మాట చెప్పలేరు. అయితే.. జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పి ఉంటారు..? బహుశా.. అధికార వర్గాల నుంచి ఆయనకు.. ఈ సలహా వచ్చి ఉంటుందేమో..?. ప్రభుత్వం ఏదైనా అవినీతి అంటూ జరిగితే.. ముందుగా బలయ్యేది అధికారులేననే ప్రచారం ఉంది. దానికి.. స్వయంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో సాక్ష్యం. ఇప్పటికే చాలా మంది… అధికారులు అవినీతి కేసుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇతరులకు అంటించడం ఎందుకన్న ఉద్దేశంతో అధికారులే.. జగన్‌కు ఈ సలహా ఇచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు.
తవ్వి తీయాలని ఒత్తిడి చేస్తే అధికారులేం చేయగలరు..?
గతంలో… వైసీపీ నేతలు.. రూ. ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని పుస్తకాలు ప్రచురించారు. ప్రధానికి ఇచ్చారు. రాష్ట్రపతికి కూడా ఇచ్చారు. ఎన్నికల ప్రచార సభల్లో అదే చెప్పారు. ఇప్పుడు.. అధికారంలోకి వచ్చిన తర్వాత… అవినీతిని తవ్వి తీయమని.. అధికారుల్ని.. జగన్మోహన్ రెడ్డి అడగడమే అతిశయోక్తిగా ఉందనే విమర్శ టీడీపీ నేతల నుంచి వస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉంది.. అధికారయంత్రాంగం చేతుల్లో ఉంది. తమ ఆరోపణలే … నిజం అయితే.. సాక్ష్యాలు రికార్డెడ్‌గా ఉంటాయి.. మరి ఎందుకు అధికారులను ఒత్తిడికి గురి చేస్తున్నారన్నది… టీడీపీ నేతల వాదన. కానీ రాజకీయాలు అంతే ఉంటాయి మరి..!