ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకంగా అమలు చేయాలనుకుంటున్న అమ్మఒడి పథకంపై… మెల్లగా వివాదాలు ప్రారంభమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మఒడి హామీకి.. అమలు చేయబోయే అమ్మఒడి హామీకి.. చాలా తేడా ఉండటంతో.. అటు ప్రైవేటు విద్యాసంస్థల యజమానుల్లోనే కాదు.. అందులో పిల్లలను చదివించుకున్న వారిలోనూ ఆందోళన ప్రారంభమయింది. హామీని అమలు చేయాలంటూ.. విజ్ఞప్తులు చేశారు. డిమాండ్ చేస్తున్నారు. త్వరలో ఉద్యమాలు చేయబోతున్నారట..
“అమ్మఒడి” జగన్ ప్రకటనలకు.. ప్రభుత్వ మాటలకూ తేడా ఎందుకు..?
“అమ్మఒడి” పథకం జగన్ నవరత్నాల్లో ఒకటి., ఆయన నవరత్నాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ప్రజలకు అందించాలనుకుంటున్నారు. అందులో బాగంగా.. “అమ్మఒడి” పథకాన్ని కూడా అమలు చేయాలనుకుంటున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా.. ఆయన ఎక్కడ మాట్లాడినా…. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా.. పిల్లలను ఎక్కడ చదివించినా… “అమ్మఒడి” పథకం కింద తల్లికి రూ.పదిహేను వేలు ఇస్తామని ప్రకటించారు. కానీ… దానికి విరుద్ధంగా.. ఆర్థిక మంత్రి , విద్యామంత్రి ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే వారికి మాత్రమే ఇస్తామంటున్నారు. సీఎం చెప్పే దానికి.. మంత్రులు చెప్పేదానికి ఎందుకు తేడా ఉంటుందో.. సామాన్యులకు అర్థం కావడం లేదు. మంత్రులు అలా అంటున్నా.. జగన్ మాత్రం ఎందుకు స్పందించడం లేదో.. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు… వాటిల్లో చదివిస్తున్న తల్లిదండ్రులకూ అర్థం కావడం లేదు.
హామీ ప్రకారం ప్రైవేటు స్కూళ్లకూ వర్తింప చేయాలంటున్న యాజమాన్యాలు..!
ఆర్థిక మంత్రి, విద్యామంత్రి ప్రకటనలతో… ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల్లో భయం ప్రారంభమయింది. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో.. ఓ రత్నానికి లోపం పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయంతో వారు ముందు జాగ్రత్త పడటం ప్రారంభించారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు… ఆ స్కూళ్ల యాజమాన్య సంఘాలు.. జిల్లాల వారీగా సమావేశాలు పెట్టి… తమకూ ఆ పథకాన్ని వర్తింప చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. డిమాండ్లు కూడా వినిపిస్తున్నారు. ప్రభుత్వం అలా చేయకపోతే… వేలాది మంది ప్రైవేటు టీచర్లు రోడ్డున పడతారని… చెబుతున్నారు.
ప్రైవేటు స్కూళ్లలో చదివించే తల్లిదండ్రులు రగిలిపోరా..?
నిజానికి ఇప్పుడు మరుమూల పల్లెల్లోనూ… అప్పో సప్పో చేసి.. పిల్లలను.. తల్లిదండ్రులు ప్రైవేటు బళ్లోనే చదివిస్తున్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. పల్లెల్లో.. కూడా.. సర్కారు బళ్లలో పిల్లలెవరూ చదివించడం లేదు. మొదటగా ప్రైవేటు బళ్లో చదివినా.. రూ. 15వేలు ఇస్తామని చెప్పిన జగన్ మాటలతో..అందరిలోనూ ఓ భరోసా వచ్చింది. వారందరూ ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల్లో కూడా.. ఈ కారణం చెప్పి ఫీజులు పెంచేశారు. జగన్ ఇచ్చే డబ్బులతో.. ఫీజులు కట్టుకోవచ్చనుకున్నారు. కానీ.. ఇప్పుడు.. సర్కార్ బడిలో చదివే వారికే అని చెబుతూండటంతో..వారిలోనూ అలజడి రేగుతోంది.